సంచలనంగా దేవగౌడ వ్యాఖ్యలు.. మోడీషాలకు షాక్ తప్పదా?

సంచలనంగా దేవగౌడ వ్యాఖ్యలు.. మోడీషాలకు షాక్ తప్పదా?

మలుపులు తిరిగిన మహారాష్ట్ర ఎపిసోడ్ లో మోడీషాలకు దిమ్మ తిరిగే షాకు తగలడం తెలిసిందే. దీంతో.. అధికారం కోసం అత్యాశకు పోయిన మోడీషాలకు మంచి అనుభవమే ఎదురైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. అనూహ్యంగా మాజీ ప్రధాని దేవేగౌడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్.. జేడీఎస్ లు కలిసి ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నయన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది.

మొండితనానికి పోయి ఇప్పటికే మహారాష్ట్ర పీఠాన్ని చేజార్చుకున్న బీజేపీ.. కర్ణాటకలో అధికారాన్ని చేజార్చుకోవటానికి ససేమిరా అనటం ఖాయం. అందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లు వ్యవహరిస్తారన్న మాట వినిపిస్తోంది.  అయితే.. ప్రజాతీర్పు కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే మాత్రం మోడీషాలు సైతం చేసేదేమీ లేదంటున్నారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు దాటినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తక్కువ కావటంతో కాంగ్రెస్.. జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడటం తెలిసిందే. కుమారస్వామి ముఖ్యమంత్రిగా 14 నెలల పాటు సాగిన ప్రభుత్వం బీజేపీ కదిపిన పావులతో సర్కారు కూలిపోవటం తెలిసిందే. నాటి అధికారపక్షానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీకి అంత సానుకూలత లేకపోవటం.. ఇటీవల కాలంలో డీకే శివకుమార్ ను జైలుకు పంపటంతో పాటు..ఇతరత్రా కారణాల నేపథ్యంలో ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చే వీలుందని జేడీఎస్.. కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే.. ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా బీజేపీ సర్వశక్తులు సమీకరించి గెలుపు కోసం ప్రయత్నించటం ఖాయం.

ఇలాంటివేళ ఉప ఎన్నికల ఫలితాలు కర్ణాటక రాజకీయ ముఖచిత్రాన్నిమార్చే వీలుందంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా తాము సహకారం అందిస్తామన్న వ్యాఖ్యలు దేవేగౌడ నోటి నుంచి రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. ఉప ఎన్నికల్లో కన్నడిగులు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English