సీమ‌పై ప‌వ‌న్ స్పెష‌ల్ ఫోక‌స్ ఎలా పెట్టాడంటే

సీమ‌పై ప‌వ‌న్ స్పెష‌ల్ ఫోక‌స్ ఎలా పెట్టాడంటే

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాయ‌ల‌సీమ‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. రాయ‌ల‌సీమ‌లో బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంద‌ని పేర్కొంటూ వారిని కాపాడుకునేందుకు త్వ‌ర‌లోనే అక్క‌డ ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు తాజాగా ఆయ‌న టూర్ ఖ‌రారైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 1వ తేదీ నుంచి రాయలసీమలో పర్యటించ‌నున్నార‌ని స‌మాచారం. అయితే, ఈ టూర్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ నారా చంద్ర‌బాబు నాయుడు జిల్లాల‌ను టార్గెట్ చేసుకున్నారు.

జ‌న‌సేన పార్టీ విడుద‌ల చేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న ప్ర‌కారం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఆరు రోజులపాటు రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది. చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటిస్తారు. రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడతారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న ప్రతినిధులను పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో కలుసుకొని వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు.

1 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు. 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకొని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. కడప జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి పయనమవుతారు. 2 వ తేదీ ఉదయం 10 గంట‌ల‌కు తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 3వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష ఉంటుంది. 4 వ తేదీ మదనపల్లె చేరుకుంటారు. అక్కడి జనసేన శ్రేణుల స్వాగతం అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేణులకు దిశానిర్దేశం చేసి అక్కడే బస చేస్తారు. 5వ తేదీ అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. తదుపరి స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చిస్తారు. 6 వ తేదీన పార్టీ కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాయలసీమ జిల్లాల్లో జనసేన నాయకులూ, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం మూలంగా ఇబ్బందులుపడుతున్నవారికి భరోసా ఇవ్వ‌నున్నార‌ని పార్టీ పేర్కొంది.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English