దేశంలో అత్యంత తక్కువ రోజులు సీఎంగా ఉన్నది వీరే..

దేశంలో అత్యంత తక్కువ రోజులు సీఎంగా ఉన్నది వీరే..

బల నిరూపణకు సత్తా చాలకపోవడంతో ఒక రోజు ముందే రాజీనామా చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ దేశంలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతల్లో ఒకరిగా రికార్డుకెక్కారు. గత టెర్ములో ఆయన అయిదేళ్లు పాలించినప్పటికీ ప్రస్తుతం మాత్రం 3 రోజుల ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. అయితే... అత్యంత తక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు మాత్రం మరో నేత పేరిట ఉంది. ఆయనే జగదాంబికా పాల్. ఉత్తర ప్రదేశ్‌కు కేవలం ఒకే ఒక రాత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం 24 గంటలు కూడా లేదు. దేశంలో ఇలా అతి తక్కువ కాలం సీఎంలుగా ఉన్న నేతలెవరో చూద్దాం..

* జగదాంబికా పాల్:
ప్రస్తుతం మహారాష్ట్రలో అంతుచిక్కని రాజకీయం నెలకొన్నట్లే 1998లో ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కాంగ్రెస్ చీలిక వర్గం లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్ మద్దతు పలకడంతో అప్పట్లో బీజేపీ నేత కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. భారీ మంత్రివర్గాన్నీ ఏర్పాటు చేశారు అయితే, కొద్దిరోజుల్లోనే లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో కల్యాణ్ సింగ్ ప్రభుత్వం రద్దయింది. అప్పుడు లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ నేత జగదాంబికాపాల్ 1998 ఫిబ్రవరి 21 రాత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే హైకోర్టులో బీజేపీ సవాల్ చేయడంతో కోర్టు తన తీర్పును మరునాటికి రిజర్వ్ చేసింది. మరునాడు జగదాంబికాపాల్ ప్రమాణ స్వీకారం చెల్లదని తీర్పిచ్చింది. దీంతో ఆయన ఒక రోజు సీఎంగా రికార్డులకెక్కారు.

* బీఎస్ యడ్డియూరప్ప
కర్ణాటకలో గత ఏడాది సీఎం పదవి చేపట్టిన బీజేపీ నేత బీఎస్ యడ్డియూరప్ప మూడు రోజులకే బల నిరూపణ సాధ్యం కాక రాజీనామా చేశారు. ఆయన 2018 మే 17 నుంచి 19 వరకు మూడు రోజులు సీఎంగా ఉన్నారు.

* సతీశ్ ప్రసాద్ సింగ్
బిహార్ ముఖ్యమంత్రిగా ఈయన కేవలం 5 రోజులు ఉన్నారు.
1968లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 1968 జనవరి 28న సీఎం అయిన ఆయన ఫిబ్రవరి 1న రాజీనామా చేసి బీపీ మండల్‌ను ఎన్నుకోవాలని సూచించారు. దీంతో అదే రోజు బీజేపీ మండల్ సీఎం అయ్యారు. ఆయన కూడా 31 రోజులు సీఎంగా ఉన్న తరువాత భోలాప్రసాద్ శాస్త్రి 100 రోజులు సీఎంగా ఉన్నారు. అనంతరం అక్కడ రాష్ట్రపతి పాలన ఏర్పడింది.

* ఓం ప్రకాశ్ చౌతాలా.. 6 రోజులు
1990లో ఓం ప్రకాశ్ చౌతాలా హరియాణా సీఎం జులై 12 నుంచి 17 వరకు సీఎంగా పనిచేశారు. ఆయన కేవలం 6 రోజులే పదవిలో ఉన్నారు.

* నితీశ్ కుమార్.. 8 రోజులు
బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ 2000 సంవత్సరం మార్చి 3 నుంచి మార్చి 10 వరకు 8 రోజులు సీఎంగా ఉన్నారు.

* బీఎస్ యడ్డియూరప్ప.. 8 రోజులు
కర్నాటక సీఎంగా 2007లో యడ్యూరప్ప నవంబరు 12 నుంచి 19 వరకు 8 రోజులే పనిచేశారు.

* ఎస్సీ మారక్.. 12 రోజులు
మేఘాలయ సీఎంగా ఎస్సీ మారక్ 1998 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు 12 రోజులున్నారు.

* భోలా పాసవాన్ శాస్త్రి.. 13 రోజులు
బిహార్ సీఎంగా ఈయన 13 రోజులు పనిచేశారు. 1969లో జూన్ 22 నుంచి జులై 4 వరకు 13 రోజులు సీఎంగా పనిచేశారు.

* ఓం ప్రకాశ్ చౌటాలా.. 17 రోజులు
1991లో మార్చి 21 నుంచి ఏప్రిల్ 6 వరకు ఓంప్రకాశ్ చౌటాలా హరియాణా సీఎంగా ఉన్నారు.

* జానకి రామచంద్రన్.. 24 రోజులు
తమిళనాడు ముఖ్యమంత్రిగా జానకి రామచంద్రన్ 1998 జనవరి 7 నుంచి 30 వరకు పనిచేశారు.

* నాదెండ్ల భాస్కరరావు.. 31 రోజులు
1984లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు నేత నాదెండ్ల భాస్కరరావు ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు 31 రోజులు సీఎంగా ఉన్నారు.

* బిందేశ్వర్ ప్రసాద్ మండల్.. 31 రోజులు
1968లో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2 వరకు ఈయన బిహార్ సీఎంగా పనిచేశారు.

* సీహెచ్ మహ్మద్ ఖోయా.. 51 రోజులు
కేరళలో 1979లో అక్టోబరు 12 నుంచి డిసెంబరు 1 వరకు ఈయన సీఎంగా పనిచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English