రాజధాని అమరావతిలోనే... జగన్ తేల్చేసినట్టే

రాజధాని అమరావతిలోనే... జగన్ తేల్చేసినట్టే

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు ఇక అవసరం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం, ఇప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు నిర్దేశించిన అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు జగన్ కూడా ఓకే చెప్పేసినట్టేనని చెప్పక తప్పదు. ఈ మేరకు నవ్యాంధ్ర నూతన రాజధానిని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తారని వస్తున్నవాదనలన్నీ తప్పేనన్నట్లుగా జగన్ ఓ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు.

అమరావతిలో సీఆర్డీఏ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జగన్ తన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. మొత్తంగా తాను అధికారంలోకి వచ్చినా... రాజధానిని అమరావతి నుంచి తరలించబోనని ఎన్నికల ముందే చెప్పిన జగన్... తన మాట మీదే నిలబడ్డారన్న మాట.

రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేసే విషయంపై సోమవారం అధికారులతో సమీక్షించిన జగన్... సీఆర్డీఏ పరిధిలో ఇప్పటికే ప్రారంభమైన పనులను ప్రధాన్యతా క్రమంలో త్వరితగతిన, వీలయినంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జగన్ నోట నుంచి వచ్చిన ఈ ఒక్క మాటతోనే రాజధానిని అమరావతిలోనే కొనసాగించనున్నట్లుగా జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లుగానే చెప్పాలి. అంతేకాకుండా... రాజధాని అమరావతి నుంచి ఎక్కడ తరలిపోతుందోనని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో నెలకొన్న ఆందోళన కూడా ఈ ఒక్క మాటతోనే పటాపంచలైపోయిందని కూడా చెప్పక తప్పదు.

జగన్ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇటు రాజధాని రైతులతో పాటు.. రాజధాని వస్తుందన్న భావనతో అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టిన బిల్డర్లు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. రాజధాని పనుల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుందని, దానిని మొత్తంగా బయటకు తీస్తామని ప్రకటిస్తున్న జగన్... రివర్స్ టెండరింగ్ కు వెళతామని ప్రకటించారు. ఈ ప్రకటన రైతులు, బిల్డర్లలో ఆందోళనను పెంచితే... జగన్ కేబినెట్ లోని బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు చేసిన ప్రకటనలు దానిని మరింతగా పెంచేశాయి. తాజాగా జగన్ నుంచి సీఆర్డీఏ పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ వచ్చిన మాట ఆ ఆందోళనను ఒక్కసారిగా పటాపంచలు చేసిందని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English