పాలెగాళ్ల రాజ్యం.. 75వ పేజీ.. జగన్ అధ్యాయం

పాలెగాళ్ల రాజ్యం.. 75వ పేజీ.. జగన్ అధ్యాయం

ట్విట్టర్ ద్వారా జగన్ సర్కారు మీద అలుపు లేని పోరాటం చేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై వరుసగా జనసేనాని ట్వీట్లు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే పవన్ చేస్తున్న విమర్శలేవీ పట్టించుకోకుండా జగన్ సర్కారు ఈ నిర్ణయం విషయంలో ముందుకు వెళ్లిపోయింది.

ఇప్పుడు పవన్ టాపిక్ మార్చాడు. కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. రాయలసీమలో మానవ హక్కుల ఉల్లంఘన మీద పోరాటం మొదలుపెట్టాడు పవన్. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా జరుగుతున్నది రాయలసీమలోనే అని.. దళిత కులాల మీద దాడులు జరిగినా ఇక్కడ బయటికి చెప్పడానికి భయపడారని.. మిగతా వాళ్లు ముఠాలు చెప్పింది మౌనంగా వినడం తప్ప ఏమీ చేయరని.. పోరాట యాత్రలో భాగంగా యువత వారి బాధలు వెళ్లబోసుకోవడం తన గుండెను కలచివేసిందని అన్నాడు పవన్.

ఈ సందర్భంగా 1996లో పౌరహక్కుల సంఘం ప్రచురించిన ‘కడప జిల్లాలో పాలెగాళ్ళ రాజ్యం’ పుస్తకం ముఖ చిత్రాన్ని చూపిస్తూ.. అందులో 75వ పేజీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ ఉదంతాన్ని పవన్ గుర్తు చేశాడు. ఐతే ఆ ఉదంతం గురించి పవన్ బయటపెట్టలేదు. పవన్ ఈ ట్వీట్ చేసిన కాసేపటికే ఆ 75వ పేజీకి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి.

కడప జిల్లా పులివెందుల తాలూకాలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో 1994లో జరిగిన ఓ ఘటనను అందులో పేర్కొన్నారు. ప్రకాష్ అనే ఎస్సై చట్టవిరుద్ధంగా తుపాకీతో వేటాడుతున్న కొందరు వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నాడని.. ఐతే దీని గురించి జగన్‌కు ఆ వ్యక్తులు ఫిర్యాదు చేస్తే.. అతను ఐదారు జీపుల్లో బయల్దేరి సింహాద్రి పురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాజశేఖర్ రెడ్డి కొడుకు చెప్పినా ఖాతరు చేయవా అంటూ ఆ ఎస్సైని స్టేషన్ లోపలే కొట్టినట్లుగా ఈ పేజీలో వివరించారు. పవన్ ప్రస్తావనతో జగన్ ఫ్యాక్షనిజం నేపథ్యం మీద సోషల్ మీడియా చర్చ నడుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English