గంగూలీని పొగిడితే గవాస్కర్‌కు మండింది

గంగూలీని పొగిడితే గవాస్కర్‌కు మండింది

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌‌కు కోపం వచ్చింది. ఎంతో కూల్‌గా ఉండే ఆయనకు కోపం తెప్పించింది టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కావడం విశేషం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని కోహ్లి పొగడ్డమే సన్నీ కోపానికి కారణం. సౌరభ్‌ను కోహ్లి పొగిడితే సన్నీకి ఏం బాధ అనిపించొచ్చు. ఇక్కడే ఉంది ట్విస్టు. ఇంతకీ కోహ్లి ఏమన్నాడో.. గవాస్కర్‌కు ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకుందాం పదండి.

ఈడెన్ గార్డెన్స్‌లో గులాబీ బంతితో జరిగిన డేనైట్ టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన కోహ్లీసేన.. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయానంతరం బహుమతి ప్రదానోత్సవంలో కోహ్లి మాట్లాడుతూ.. ఒకప్పుడు సౌరభ్ గంగూలీ నాయకత్వంలో భారత జట్టు ప్రత్యర్థులకు దీటుగా నిలిచి ఎలా విజయాలు సాధించాలో చూపించిందని.. దాన్నే తాము కొనసాగిస్తున్నామని అన్నాడు. ఈ వ్యాఖ్యే సన్నీకి కోపం తెప్పించింది.

భారత జట్టు 70లు, 80ల్లోనే ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని.. అవన్నీ మరిచి గంగూలీ నాయకత్వంలోనే టీమ్ ఇండియా విజయాలు సాధించడం మొదలైనట్లుగా మాట్లాడటం సరికాదనే అభిప్రాయాన్ని సన్నీ వ్యక్తం చేశాడు. 70ల నాటికి కోహ్లి ఇంకా పుట్టి ఉండకపోవచ్చని.. అప్పుడే భారత జట్టు ఎన్నో మ్యాచ్‌లు గెలిచిందని.. కోహ్లి లాగే చాలామంది 2000వ సంవత్సరం తర్వాతే భారత క్రికెట్ మొదలైనట్లుగా మాట్లాడుతుంటారని సన్నీ అన్నాడు. ప్రస్తుతం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడని.. అతణ్ని మెప్పించడానికి కోహ్లి తన గురించి మంచి మాటలు చెబుతుండొచ్చని సన్నీ చురక అంటించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English