వైసీపీ ఎంపీలు VS ఎమ్మెల్యేలు... ఏపీ అంతా ఇంతే...!

వైసీపీ ఎంపీలు VS ఎమ్మెల్యేలు... ఏపీ అంతా ఇంతే...!

రాష్ట్రంలో లెక్క‌కు ఎక్కువ‌గా ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్న వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. మొత్తం 25 మంది ఎంపీల‌కు గాను 22 మందిని గెలిపించుకున్న ఈ పార్టీ ఢిల్లీలోనూ చ‌క్రం తిప్పాల‌ని భావించింది. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేల‌తో తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించింది. అయితే, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఉన్న ఆనందం ఇప్పుడు ఆ పార్టీలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు ఎమ్మెల్యే అభ్య‌ర్థులు, ఎంపీ అభ్య‌ర్థులు క‌లిసి క‌ట్టుగా పోటీ చేసిన పార్టీని బ‌లోపేతం చేసి, భారీ మెజారిటీ దిశ‌గా పార్టీని న‌డిపించినా.. ఇప్పుడు మాత్రం వారి మ‌ధ్య తీవ్ర‌మైన ఆధిప‌త్య పోరు సాగుతోంది. ఏదో ఒక జిల్లాలోనో రెండు జిల్లాల్లోనో ఈ ప‌రిస్థితి ఉంటే.. స‌రేలే! అనుకుని స‌రిపెట్టుకునే వాళ్లం.

కానీ, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.  ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు మ‌ధ్య జిల్లా రాజ‌కీయాల్లో ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు కోల్డ్‌వార్‌గా కొన‌సాగినా..ఇటీవ‌ల అదికాస్త ముదిరి పాక‌నా ప‌డ్డ‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన, సాగుతున్న జ‌గ‌న్ పాల‌నను చూస్తే.. ఎమ్మెల్యేల‌కు స‌ర్వాధికారులు ఇచ్చిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏ కార్య‌క్రమమైనా.. ఎమ్మెల్యే క‌నుస‌న్న‌ల్లోను, మంత్రుల కనుసన్న‌ల్లోనూ సాగాల‌ని జ‌గ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు కూడా ఎమ్మెల్యేల‌కు అనుకూలంగా ఉండాల‌ని అన్నారు. అయితే, అదే స‌మ‌యంలో ఎంపీల విష‌యా న్ని జ‌గ‌న్ ఎక్క‌డా ఏమ‌నీ చెప్ప‌లేదు.

అంటే, ఎంపీల‌ను అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో జోక్యం చేసుకోవాల‌ని కానీ, చేసుకోవ‌ద్ద‌ని కానీ జ‌గ‌న్ ఎక్క‌డా సూచించ‌లేదు. దీంతో ఎమ్మెల్యేలే అంతా తామై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరిలో సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు కూడా ప‌రిస్థితి ఇలానే ఉంది. ఇక‌, ఎమ్మెల్యే అనుచ‌రులు కూడా నియోజ‌క‌వ‌ర్గాల్లో అంతా తామై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఎంపీలు ఏమైనా చేయాల్సి వ‌స్తే.. ఎమ్మెల్యేల‌తో మాట్లాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనిని చాలా మంది ఎంపీలు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా ఇసుక‌, మైనింగ్ విష‌యాల్లో ఎంపీల జోక్యాన్ని ఎమ్మెల్యేలు అస్స‌లు స‌హించ‌లేక పోతున్నారు. దీంతో ఎంపీల‌కు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

నిజానికి పార్లమెంటులోనూ, ఢిల్లీ స్థాయిలోనూ చక్రం తిప్పగలిగింది, నిధులు, ప్రాజెక్టులు తీసుకురాగలిగింది పార్లమెంటు సభ్యు లు మాత్రమే. అయితే, గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలో అటు పార్ల‌మెంటులోనూ, ఇటు త‌మ నియోజ‌వ‌క‌ర్గాల్లోనూ ఎంపీలు చ‌క్రం తిప్పేవారు. కానీ, ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వంలో మాత్రం ఆ ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి పడటం లేదు. న‌ర‌సారావుపేట లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల‌కు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడద‌ల ర‌జినికి మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయ‌ని తెలుస్తోంది.

రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు  జిల్లా మంత్రి, ఎమ్మెల్యేల‌కు ఏమాత్రం ప‌డ‌టం లేదని తెలుస్తోంది. తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌ను ఆయ‌న సెగ్మెంట్ ప‌రిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స‌మాచారం.  అలాగే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు జిల్లా ఎమ్మెల్యేల‌కు ఏమాత్రం పొస‌గ‌డం లేదని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఇక‌, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి  నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేలకు మ‌ధ్య కోల్డ్‌వార్ కొన‌సాగుతోంది.  న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు  జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు సైతం లెక్క చేయడం లేదు. నిజానికి ఈయ‌న బీజేపీతో ట‌చ్‌లో ఉంటున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది.  

ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎంపీలు చాలా మంది తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. తాము ఉన్న‌ది ఎందుకు?  గెలిచింది ఎందుకు? అనే వాద‌న వారి నుంచి వినిపిస్తోంది. ఇది ప్ర‌ధాన మీడియాలోనూ రావ‌డంతో పార్టీ అలెర్ట్ అయింది. కీల‌క నేత‌ విజయసాయిరెడ్డి ఎంపీల‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అయితే, ఈ స‌మావేశంలోనూ ఎలాంటి కంక్లూజ‌న్ రాక‌పోవ‌డం, పైగా జ‌గ‌న్ నుంచి ఆంక్ష‌లు వినిపించ‌డంతో ఎంపీల్లో ఆగ్ర‌హం ఇంకా చ‌ల్లార‌లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English