2024 ఎలక్షన్స్ జగన్ వర్సెస్ పవన్

2024 ఎలక్షన్స్ జగన్ వర్సెస్ పవన్

ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ తాము రాజకీయంగా ఎదుర్కోవాల్సింది ఒక్క టీడీపీనే అనుకుంది. జనసేన పార్టీ ఒకే సీటుకు పరిమితం కావడం... ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా పెద్ద అనుభవం లేకపోవడం, స్థిరంగా రాజకీయాలు చేసిన చరిత్ర లేకపోవడం, ఆయన్ను విమర్శించడానికి రాజకీయ.. వ్యక్తిగత అంశాలు అనేకం ఉన్నాయిలే అనుకోవడంతో ఆయన్ను ఒకింత తేలిగ్గానే తీసుకున్నారు. కానీ... రోజులు గడిచే కొద్దీ పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వాధినేతయిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి పెద్ద సవాల్‌గా మారుతున్నారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భవన నిర్మాణ కార్మికుల సమస్యతో ప్రారంభించిన పవన్ కల్యాణ్ అప్పటి నుంచి వరుసగా ప్రతి రోజూ ఏదో రూపంలో సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యపై ఆయన విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కూడా నిర్వహించారు. అనంతరం తెలుగును పూర్తిగా పక్కన పెట్టి ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రయత్నించడంపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మీడియాలో వచ్చే వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభుత్వానికి చికాకుపెడుతున్న పవన్‌ ఇప్పుడు పాలక వైసీపీకి ప్రధాన లక్ష్యమయ్యారు. అదే సమయంలో విపక్ష టీడీపీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తమ పవన్ ప్రభావవంతంగా కనిపిస్తుండడంతో ఆయనకు సపోర్టు ఇస్తోంది.

మరోవైపు పవన్ కూడా కసితో పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల తరువాత సినిమాలు చేసుకుంటాడని అంతా భావించినా ఆయన ఏపీలోని ఇష్యూలపై నిత్యం పనిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి దొరికే ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. నిర్మాణాత్మక విమర్శలు చేయడానికి, పక్కా ఆధారాలతో విమర్శలు చేయడానికి వీలుగా ఎప్పటికప్పుడు పక్కా వివరాలు సంపాదించేలా ఒక బృందాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. పనిలో పనిగా టీడీపీకి ఇప్పటికే ఉన్న ఇలాంటి భారీ వ్యవస్థ నుంచి కూడా పవన్‌కు ఇన్‌పుట్స్ అందుతున్నాయి. వెరసి.. పవన్ మంచి స్వింగులో ఉంటూ జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు.

కేంద్రంలోని బీజేపీతో సయోధ్యతో సాగిపోతే చాలు ఈ అయిదేళ్లు, వీలైతే ఆ తరువాత మరో అయిదేళ్లు హాయిగా బండి నడిపేయొచ్చని భావిస్తూ మోదీ, అమిత్‌షాలకు వినయంగా సలాములు కొడుతూ.. వారికి ఏమాత్రం నచ్చని ప్రత్యేక హోదా వంటి అంశాలకు పాతరేసేసి ముందుకెళ్తున్న జగన్‌కు అక్కడా ఇబ్బంది పెట్టాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆ క్రమంలోనే ఆయన జగన్‌ను కేంద్రంలోని పెద్దలకు వ్యతిరేకంగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం జగన్ క్రైస్తవ పక్షపాతి, హిందూ వ్యతిరేకి అని చూపించడానికి గల అన్ని అవకాశాలనూ వాడుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, గతంలో మోదీ, అమిత్ షాల వద్ద తనకు పరపతి ఉన్నప్పటికీ అనంతర కాలంలో చంద్రబాబు మనిషిగా వైసీపీ ముద్ర వేయడంతో మోదీ వద్ద పరపతి తగ్గింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ముద్రను తొలగించుకుని బీజేపీకి దగ్గర కావడానికి పవన్ అన్ని అవకాశాలనూ వాడుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల రెండు రోజులు దిల్లీలో మకాం వేశారనీ చెబుతున్నారు.

మొత్తానికి గత రెండు నెలలుగా చూస్తే ఇసుక విషయంలో కానీ, ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ పవన్ కల్యాణ్ చేసిన పోరాటాలు ప్రజలకు చేరాయి. ఆయన లక్ష్యంగా వైసీపీ నేతలు చేస్తున్న ఎదురుదాడి చూస్తుంటే ప్రభుత్వానికి కూడా పవన్ సెగ తగిలింది. ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో కాస్త బలపడితే.. భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలను కూడా పవన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

వీటన్నిటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీకి ప్రధాన పోటీదారుగా పవన్ కల్యాణ్ ఎదుగుతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా ఈ విషయంలో అవసరమైతే టీడీపీ వెనక్కు తగ్గి పవన్‌కు సహకరించే యోచనలోనూ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఒక్క సీటుకే పరిమితమైన జనసేన పార్టీకి రెండు సీట్లలో ఓడిపోయిన అధినేత పవన్ కల్యాణ్ ఆ పరాజయాల తరువాత పడి లేచిన కెరటంలో రాజకీయంగా ఎదుగుతున్నట్లే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English