జ‌గ‌న్ నిర్ణ‌యంతో తెలంగాణ వంటి ఉద్య‌మం వ‌స్తుంద‌ట‌

జ‌గ‌న్ నిర్ణ‌యంతో తెలంగాణ వంటి ఉద్య‌మం వ‌స్తుంద‌ట‌

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు ఘాటుగా స్పందించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మం విష‌యంలో దూకుడుగా స్పందిస్తున్న ప‌వ‌న్ ఇటీవ‌లే...న‌దుల ప‌రిర‌క్ష‌ణ‌ను సైతం ముందుకు తీసుకువెళ్లాల‌ని డిసైడ‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ' మన నుడి - మన నది ' ఉద్యమానికి ప‌వ‌న్ శ్రీ‌కారం చుట్టారు. అయితే, ఇందులో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం కూడా క‌ల్పించాల‌ని ఆయ‌న డిసైడ‌య్యారు. ఈ మేర‌కు తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇదే స‌మ‌యంలో...జ‌గ‌న్ తీరుతో తెలంగాణ వంటి ఉద్య‌మం వ‌స్తుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం అనే అంశాలను  జనసేన సప్త సూత్రాలలో పొందుపరిచినట్లు పేర్కొన్న ప‌వ‌న్‌...తెలుగు భాషను కాపాడుకోడానికి జనసేన ముందడుగు వేయడానికి సంకల్పించిందని తెలిపారు. తెలుగు భాష - మన నదుల  పరిరక్షణ తన బాధ్యతగా జనసేన భావిస్తోందన్నారు. ``అమ్మ భాషను తెలుగు జాతి పొదివి పట్టుకోకపోతే ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో తేట తెలుగు కాస్తా మాలిన్యపు తెలుగుగా మారిపోయి చివరకు అంతరించిపోయే ప్రమాద ఘంటికలు ఇప్పుడు  మోగుతున్నాయి. మన నదులు, నీటి వనరులు కలుషితమైపోతున్నాయి.

స్వచ్ఛమైన నీటి వనరులు తద్వారా ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని, తీయనైన తెలుగు భాష తద్వారా మన సంస్కృతిని భావితరాలకు అందించకపోతే మనం జాతికి ద్రోహం చేసినవారం అవుతాము. నిర్మలంగా ప్రవహించే  గోదావరి, తుంగభద్ర నదులలోకి  కాలుష్యం మెల్లగా కలిసిపోవడాన్ని పోరాట యాత్రలో ప్రత్యక్షంగా చూశాను. నిండుగా గోదావరి చెంత ఉన్నా తాగడానికి గుక్కెడు మంచి నీరులేని గోదావరి జిల్లాల గ్రామాలను వీక్షించాను. జల వనరులు విషమయం అయిపోతున్నాయి. అలాగే మన మాతృ భాషకీ ముప్పు పొంచి ఉంది. ఇటువంటి స్థితినుంచి మన భాషను, మన నదులను కాపాడుకోవడం తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నాను.`` అని వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ తీరుపై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ``భాషను, సంస్కృతిని రక్షించకపోయినా, అవహేళన చేసినా వేర్పాటువాదాలు ప్రబలే ప్రమాదముందని తెలంగాణ  ఉద్యమ అనుభవాలు మనకు తెలియచేస్తున్నాయి. మొఘలాయిలు, ఐరోపా మిషనరీల పాలనలో  తెలుగు భాషను ప్రజలే రక్షించుకున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి పరిపాలనలో మళ్ళీ ప్రజలే తెలుగు భాషను సజీవ భాషగా కాపాడుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.`` అని విమ‌ర్శించారు. ``ప్రపంచీకరణకు నాంది పలికిన అమెరికాలో ప్రస్తుతం జాతీయవాదం తెర మీదకు వచ్చిన సంగతి మనం విస్మరించగలమా? మెసపుటోమియా వేర్పాటువాదం, యూరోప్ (బ్రెగ్జిట్)  విభేదాలు, స్పెయిన్ నుంచి విడిపోతామంటున్న  బార్సిలోనా వాసులు, మన దగ్గర తెలంగాణ ఆవిర్భావం..  ఇవన్నీ భాష, యాస, సంస్కృతులను నిర్లక్ష్యం చేయడం వల్లనేగా...!అందువల్ల తెలుగు భాష  సజీవ భాషగా వర్థిల్లడానికి తనవంతు కృషిని చేయాలని జనసేన సంకల్పించింది.`` అని పేర్కొన్నారు.

తెలుగు జీవ భాషగా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుపాల‌ని కోరుతూ...ప్ర‌జ‌లు సూచనలు, సలహాలు స్వీకరించడానికి  ప్రత్యేక విభాగాలను జనసేన పార్టీ విజయవాడ, హైదరాబాద్ కార్యాలయాలలో  ఏర్పాటు చేస్తున్నామని జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌ట‌న వెల్ల‌డించింది. పది రోజులులోగా మీ అమూల్యమైన సూచనలు అందచేయండి అని కోరింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English