హ్యాపీ నెస్ట్‌కూ రివర్స్ ‘టెండర్’

హ్యాపీ నెస్ట్‌కూ రివర్స్ ‘టెండర్’

విభజన తరువాత ఏపీ రాజధాని అమరావతిలో మంచి ఇల్లు కొనుక్కోవాలని ఆశించి సీఆర్డీయే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమరావతి హ్యాపీ నెస్ట్’ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పుడు దీనికీ రివర్స్ టెండరింగ్ చేయాలనుకోవడంతో తమ పెట్టుబడులు గంగపాలేనని గగ్గోలు పెడుతున్నారు. తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని కోరుతున్నారు.

ఈ ప్రాజెక్టుకు రాజధాని అమరావతి ప్రాంతంలోని నేలపాడులో 14.50 ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. అమరావతిని అంతర్జాతీయస్థాయి రాజధాని నగరంగా తీర్చిదిద్దే క్రమంలోనే మాజీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్టులో భాగంగా సీఆర్‌డీఏ కేటాయించిన భూమిలో 12 టవర్లను నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో టవర్‌లో 19 అంతస్తులు ఉంటాయి. వీటిలో 1,200 2/3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌లను నిర్మించి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఫ్లాట్‌ విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ.3,492గా ధరను నిర్ణయించారు. ఆయా ఫ్లాట్‌లలో 1,225 చదరపు అడుగుల నుంచి 2,750 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌లను నిర్మించాల్సి ఉంది.

అయితే, అన్ని శాఖల్లో మాదిరిగానే హ్యాపీ నెస్ట్‌లోనూ రివర్స్‌ టెండరింగ్‌ను అమలు చేయాలని ఇప్పుడు జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేసే అంశంపై సీఆర్‌డీఏ అధికారులు ఇప్పటికే అధ్యయనం చేసినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న సీఆర్‌డీఏ సమీక్షలో ఆ నివేదికను సీఎం ఎదుట ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. ఆ సమావేశంలోనే హ్యాపీ నెస్ట్‌ రివర్స్‌ టెండరింగ్‌ విధానంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.

హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ‘షాపూర్‌జీ పల్లోంజీ’ సంస్థ దక్కించుకుంది. గతేడాది ఆగస్టులో అప్పటి సీఎం చంద్రబాబు అమరావతి హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్టును ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో గృహనిర్మాణ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్రంగా దేశంలోనే ఏపీ ప్రధమస్థానంలో నిలిచింది. హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్టు యూనిట్‌ల వేలం ప్రక్రియకు విశేష స్పందన లభించింది. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఎన్నికలకు నెల రోజుల ముందే హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టులో మాదిరిగా రివర్స్‌ టెండరింగ్‌ను అమలు చేస్తే, హ్యాపీ నెస్ట్‌లో ధరలు తగ్గే అవకాశం మాత్రం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు టెండరు ఖరారైనప్పటికీ ఇంకా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆరంభంకాలేదు. దీనికితోడు రివర్స్‌ టెండరింగ్‌ ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో ఫ్లాట్‌లను కొనుగోలు చేసిన వారు తమ డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని కోరుతున్నారు. ఫ్లాట్‌లను బుకింగ్‌ చేసుకున్న మొత్తం విలువలో పది శాతం మొత్తాన్ని చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ ఊహించనిరీతిలో రివర్స్‌ను అమలు చేయాలని యోచిస్తుండటంతో ప్లాట్‌లను కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English