ఆర్టీసీ స‌మ్మె...కేసీఆర్‌పై ఢిల్లీ స్పెష‌ల్ ఫోక‌స్‌?!

ఆర్టీసీ స‌మ్మె...కేసీఆర్‌పై ఢిల్లీ స్పెష‌ల్ ఫోక‌స్‌?!

ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా...కేంద్రం తెలంగాణపై ఫోక‌స్ పెంచుతోంది. ప్ర‌ధానంగా ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో కేసీఆర్ వైఖ‌రిని నిశితంగా గ‌మ‌నిస్తోంది, ఆరా తీస్తోంది. ఓవైపు బీజేపీ ఎంపీలు, రాష్ట్రానికి చెందిన కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి ఫిర్యాదుల ప‌రంప‌ర కొన‌సాగిస్తుంటే..మ‌రోవైపు కేంద్రమంత్రులు సైతం ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో నేరుగా రంగంలోకి దిగుతున్నారు. అంతేకాకుండా క్షేత్ర‌స్థాయిలో ఉండే గ‌వ‌ర్న‌ర్ ద్వారా సైతం ఓ క‌న్నేసి ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

గురువారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని క‌లిసి తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మె గురించి ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు, అర్వింద్ ధర్మపురి వివ‌రించారు. కేంద్రం చేసిన చ‌ట్టం ఆధారంగా కేసీఆర్ కార్మికుల విష‌యంలో మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని...అదే స‌మ‌యంలో, బీజేపీని దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని బీజేపీ ఎంపీలు కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీకి  వివ‌రించారు. దీంతో గ‌డ్క‌రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. దాదాపు గంట‌పాటు ప్ర‌య‌త్నించినా...ఆయ‌న లైన్లోకి రాలేద‌ని స‌మాచారం.

మ‌రోవైపు...తాజాగా శుక్ర‌వారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌తో బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యలను వివరించిన ఎంపీలు ఆగస్ట్ 2019 గాను కార్మికులకు ఆర్టీసీ రూ. 80 కోట్ల బకాయిలు చెల్లించమని ఈపీఓ నుంచి డిమాండ్ నోటీస్ వచ్చిందని వివ‌రించారు. మొత్తం పీఎఫ్ కు సంబంధించిన రూ.760 కోట్లు బకాయిలు చెల్లించడం లేదని, ఇప్పటికే 49000 ఉద్యోగులు సమ్మె చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి స్పందించలేదని ఎంపీలు ఫిర్యాదు చేశారు. వెంటనే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా జోక్యం చేసుకోవాలని కోరారు.

ఇదిలాఉండ‌గా, ఢిల్లీలో జరిగే అన్నిరాష్ర్టాల గవర్నర్ల సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ గురువారం రాత్రి వెళ్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన జ‌రిగే ఈ స‌మావేశం అనంత‌రం మ‌రో రెండు రోజుల పాటు ఆమె ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె వ‌ద్ద నుంచి కేంద్రం పెద్ద‌లు నివేదిక తీసుకుంటార‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English