టీ ఆర్టీసీకి స‌మ్మెట పోటు త‌ప్ప‌దా..!

టీ ఆర్టీసీకి స‌మ్మెట పోటు త‌ప్ప‌దా..!

తెలంగాణ‌లో 48రోజులుగా జ‌రిగిన స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసీ ప్ర‌క‌టించింది. హైకోర్టు సూచ‌న మేర‌కు ఆర్టీసీ కార్మికులు మెట్టుదిగారు. కానీ తెలంగాణ స‌ర్కారు బెట్టు వీడ‌టం లేదు. విధుల్లో చేరేందుకు ఆర్టీసి కార్మికులు స‌మాయ‌త్తం అయి డీపోల వ‌ద్ద‌కు చేరితే అధికారులు ప్ర‌భుత్వ అనుమ‌తి లేనిదే చేర్చుకునేది లేద‌ని స‌మాధానం ఇస్తుండ‌టంతో కార్మికులు మ‌రోసారి స‌మ్మెకు స‌మ‌యాత్తం కాక‌త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. సమ్మె విరమించి విధులకు హాజరుకావాలనుకుంటున్న కార్మికులకు చుక్కెదురవుతోంది.

డిపోల వద్ద అధికారులు వారిని అడ్డుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుండి తమకు ఆదేశాలు రాలేదని వారిని లోపలికి అనుమతించకుండా గేట్‌ వద్దే నిలువరిస్తున్నారు అధికారులు. ప్రభుత్వం తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో విధుల్లోకి చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. డిపోలోకి రాకుండా వారిని గేట్‌ వద్దే ఆపేశారు. ఉన్నతాధికారుల నుండి తమకు ఎలాంటి ఆదేశాలు రానందున లోపలికి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. దీంతో డిపో వద్దకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించారు.

బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. సమ్మె విరమణ ప్రతిపాదనపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు స‌మీక్ష నిర్వ‌హించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నిర్ణ‌యం మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు... తెలంగాణ స‌ర్కారు ఆర్టీసీని న‌డ‌పాలంటే వంద‌ల కోట్లు కావాల్సిన అవ‌స‌రం ఉంది.. సెప్టెంబ‌ర్ జీతాలు ఇవ్వాలంటే వంద‌ల కోట్లు కావాలి.. ఆర్టీసీ అప్పులు తీర్చాలంటే వేల కోట్లు కావాలి అని ప్ర‌క‌టించారు.

కేసీఆర్ వెర్ష‌న్ చూస్తే ఆర్టీసిని న‌డిపితే వ‌చ్చేది న‌ష్టాలే త‌ప్ప లాభాలు కాదు.. అందుకు ఆర్టీసిని ప్రైవేటు ప‌రం చేస్తే త‌ప్ప లాభం లేద‌ని ముక్తాయించారు. హైకోర్టు తీర్పు వ‌చ్చిన త‌రువాత తెలంగాణ‌ సర్కారు స్పందనపై కార్మికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ స‌ర్కారు కావాల‌నే ఆర్టీసి కార్మికుల‌ను విధుల్లోకి తీసుకునేందుకు కాల‌యాప‌న చేస్తున్న‌ట్లు వారు ఆరోపిస్తున్నారు. అందుకే బెట్టు వీడ‌ని తెలంగాణ స‌ర్కారుకు బుద్ది చెప్పాలంటే దీర్ఘ‌కాలిక పోరాట‌మే శ‌రణ్య‌మ‌ని ఆర్టీసీ జేఏసీ ఆలోచ‌న చేస్తున్న‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

తెలంగాణ స‌ర్కారు ఇలాగే కాల‌యాప‌న చేస్తే తిరిగి విధుల్లో చేర‌కుండా స‌మ్మె బాట ప‌ట్టాల‌ని చూస్తున్నారు. హైకోర్టుపైన గౌర‌వంతో స‌మ్మెను విర‌మిస్తే కార్మికుల‌ను  స‌ర్కారు విధుల్లోకి తీసుకోలేద‌ని చెప్పేందుకు ఇది ఒక ఎత్తుగ‌డగానే భావిస్తున్నారు కార్మికులు. ఏదేమైనా ఆర్టీసీపై ప్ర‌భుత్వం సానుకూల నిర్ణ‌యం తీసుకోకుండా కార్మికుల‌ను విధుల్లో చేర‌కుండా అడ్డుకుంటే రాబోవు రోజుల్లో కార్మికులు మ‌రింత ఉద్య‌మించే అవ‌కాశం లేక‌పోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English