ఆ కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీని గాలికొదిలేశారా..?

ఆ కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీని గాలికొదిలేశారా..?

అధికారం లేకపోవడమో లేక వైసీపీ ఇబ్బంది పెడుతుందనే భయమో తెలియదు గానీ...మొన్నటివరకు అధికారం అనుభవించిన టీడీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గ నేతలు ప్రతిపక్షంలోకి రాగానే పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

ఏదో అధినేత చంద్రబాబు ఒక్కడే కష్టపడటం తప్ప, ఆయనకు కమ్మ నేతలు ఎవరు పూర్తిగా సహకరించడం లేదు. సరే ఓడిపోయి ఆరు నెలలు కూడా కాలేదు కదా...ఓటమి భారం ఇంకా తగ్గి ఉండదు కాబట్టి నేతలు బయటకు రావడం లేదు అనుకోవచ్చు. కానీ  పార్టీ తరుపున గెలిచిన కమ్మ ఎమ్మెల్యేలు కూడా బాబుని ఒంటరిగానే వదిలేశారు.

సాధారణంగా తెలుగుదేశంలో కమ్మ సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్న సంగతి చిన్నపిల్లాడికి సైతం తెలుసు. అందుకే ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 23 సీట్లు తెచ్చుకున్న అందులో 11 మంది కమ్మ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక ఈ 11 మందిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లెక్కలో నుంచి తీసేయొచ్చు. ఇటీవలే ఆయన బాబుని బండబూతులు తిట్టి...జగన్ కు జై కొట్టారు. అంటే వంశీని పక్కనబెడితే 10 మంది ఉన్నారు. ఇందులో కుప్పం నుంచి గెలిచిన పార్టీ అధినేత చంద్రబాబుని కూడా పక్కనబెడితే 9 మంది ఉన్నారు. బాబుకు ఎలాగో అధ్యక్షుడు కాబట్టి ఆయన తిప్పలు ఆయన పడుతున్నారు.

అయితే మిగిలిన 9 మంది పార్టీ కోసం ఏం చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇందులో చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సినిమాలే లోకం. ఏదో గ్యాప్ లో అలా వచ్చి హిందూపురంలో మెరిసి మళ్ళీ వెళ్లిపోతారు. అటు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లో ఒకప్పటి ఫైర్ లేదు. బాబు ఏరికోరి పి‌ఏ‌సి ఛైర్మన్ ఇచ్చిన కేశవ్ కామ్ గానే ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం బాగోలేక హాస్ప‌టల్లో చికిత్స పొందుతున్నారు.

ఇటు వస్తే ప్రకాశం జిల్లాలో ముగ్గురు కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియోజకవర్గం స్థాయిలో బాగానే కష్టపడుతున్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంల పరిస్తితి ఏంటో అర్ధం కాకుండా ఉంది. వీరు పార్టీ మారతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ వార్తలని వీరు ఖండించారు. అలా అని టీడీపీలో యాక్టివ్ గా ఉండరు. నాలుగు సార్లు గెలిచినా గొట్టిపాటి ర‌వి ఆ అద్దంకి దాటి బ‌య‌ట‌కు రారు. బ‌ల‌రాం పార్టీలో ఉండాలా ?  వెళ్లాలా ? అన్న మీమాంస‌లో ఉన్నారు.

ఇటు కృష్ణాలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న దూకుడుగా వెళ్లే సాహ‌సం చేయ‌డం లేదు.  తూర్పుగోదావరి జిల్లాకొస్తే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ మొన్నటివరకు దూకుడుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు అనారోగ్యం వల్ల కాస్త వెనుకబడ్డారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణలు మా పని ఏదో మాది అన్నట్లు నడుస్తున్నారు. మొత్తానికైతే అధికారం లేకపోతే టీడీపీలో కమ్మ ఎమ్మెల్యేల జోరు బేజారే అన్న‌ట్టుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English