ఇంకా ఆ ఎమ్మెల్యే టీడీపీలో ఎందుకు ఉంటున్నారో?

ఇంకా ఆ ఎమ్మెల్యే టీడీపీలో ఎందుకు ఉంటున్నారో?

తెలుగుదేశం... తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకులకు భవిష్యత్తు ఇచ్చిన పార్టీ. ఇప్పుడు అలాంటి పార్టీకే భవిష్యత్తు లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ నూటికి నూరు శాతం చరిత్రలో కలిసిపోయిన పార్టీనే. అలా చరిత్రలో కలిసిపోయిన పార్టీని అధినేత చంద్రబాబు, అక్కడున్న కొందరు నేతలు ఏదొకటి చేసి పైకి లేపాలని అనుకుంటున్నారు. అయితే ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా... ఎంత అనుకున్న పూర్తిగా మునిగిపోయిన పడవలాంటి పార్టీని పైకి లేపడం అసాధ్యం. ఇటీవ‌ల హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో సైతం టీడీపీ పోటీ చేసి కేవ‌లం 1500 ఓట్ల‌తో స‌రిపెట్టుకుంది. ఇక తెలంగాణ‌లో అంద‌రూ పార్టీని వదిలేసినా ఒక ఎమ్మెల్యే మాత్రం అలాగే పట్టుకుని వేలాడుతున్నారు.

మునిగిపోయిన పడవలో ఇంకా ప్రయాణం చేద్దామని అనుకున్నారు. కానీ అది ఇప్పుడు సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. అందుకే ఆయన వేరే ఒడ్డుకు చేరుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఉమ్మ‌డి ఖమ్మం జిల్లా (భ‌ద్రాద్రి కొత్త‌గూడెం) అశ్వరావుపేటకు చెందిన మెచ్చా నాగేశ్వరరావు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ తో పెట్టుకుని రెండు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి నాగేశ్వరావులు గెలిచారు.

వీరిలో సండ్ర టీడీపీకి బై చెప్పి....తమ సహచరులు నిండుగా ఉన్న టీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే నాగేశ్వరావు మాత్రం టీడీపీని వదలనని, ఇక్కడే ఉంటానని గట్టిగా చెప్పి అలా ఉండిపోయారు. ఆయ‌న ఏపీకి వ‌చ్చి చంద్ర‌బాబును సైతం ప‌లుసార్లు క‌లిశారు. ఇప్పుడు ఏపీలోనే పార్టీ గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. ఇక తెలంగాణ‌లో రాను రాను టీడీపీ కనుమరుగైపోయే పరిస్థితికి వెళ్లిపోతుంది. కాబట్టి ఇందులో ఉంటే ఎమ్మెల్యేకు ఎలాంటి ఉపయోగం ఉండద‌న్న‌ది ఆయ‌న‌కు కూడా పూర్తిగా క్లారిటీ వ‌చ్చేసింది.

ఇక నాగేశ్వ‌ర‌రావు కూడా మరొక ఆప్షన్ చూసుకుంటే మంచిదని అక్కడ కార్యకర్తలు భావిస్తున్నారట. అశ్వారావుపేట‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు అంతా ఒత్తిడి తేవ‌డంతో ఎమ్మెల్యే కూడా దీని గురించి ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అయితే టీడీపీలోనే కొనసాగితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే అవకాశముంది. ఇక ఇప్ప‌టికే ఆయ‌న అక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్నా ప‌నులు అవ్వ‌ట్లేదు. దీంతో ఆయ‌న పార్టీ మార్పుపై ఊగిస‌లాట‌లో ఉన్న‌ట్టు టాక్‌..? తెలంగాణ టీడీపీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రానున్న రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో ?  చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English