వైసీపీలో ఇద్ద‌రు ఎంపీల‌పై డౌట్ కొడుతోందా...!

 వైసీపీలో ఇద్ద‌రు ఎంపీల‌పై డౌట్ కొడుతోందా...!

లెక్క‌కు మిక్కిలిగా ఉన్న ఎంపీల విష‌యంలో వైసీపీకి అప్పుడే త‌ల‌నొప్పులు ప్రారంభ‌మ‌య్యాయి. 22 మంది ఎంపీల‌ను గెలుచుకున్నామ‌న్న ఆనందం పార్టీలో అప్పుడే ఆవిర‌వుతున్న ప‌రిస్తితి క‌నిపిస్తోంది. దాదాపు అంద‌రూ కొత్త‌వారే అయినా.. వీరిలో జంప్ జిలానీలు ఉండ‌డం, కొంద‌రు సీనియ‌ర్లు కావ‌డంతో వారు ఆధిపత్య రాజ‌కీయాల వైపు అడుగులు వేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో పార్టీ అధినేత‌కు, వారికి మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇటీవ‌ల జ‌గ‌న్ .. ఎంపీలను ఉద్దేశించిన చేసిన కొన్ని కీల‌క వ్యాఖ్య‌ల‌తో ఇద్ద‌రు ముగ్గురు సీనియ‌ర్ ఎంపీలు నొచ్చుకున్నార‌ని అంటున్నారు. అన్ని విష‌యాలు పార్టీలో చ‌ర్చించి, అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే ఎంపీలు మీడియా ముందుకు రావాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు.

అదే స‌మ‌యంలో పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఎంపీలు ఇష్టానుసారం ఎవ‌రి అ జెండాను వారు ఎత్తుకోకుండా పార్టీ సిద్ధాంతాలు, లైన్ ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని కూడా చెప్పారు. అయితే, ఈ విష‌యంతో ఇద్ద‌రు ఎంపీలు పొస‌గ‌డం లేద‌ని అంటున్నారు. వీరిలో ఒక‌రు గోదావ‌రి జిల్లాకు చెందిన ఎంపీ కాగా, మ‌రొక‌రు ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఎంపీ ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రూ కూడా వివిధ పార్టీలను మారి.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకుని పోటీ చేసి.. జ‌గ‌న్ హ‌వాలో గెలుపు గుర్రం ఎక్కిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం.

పైగా ఈ ఇద్ద‌రుఎంపీల‌కు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఒక ఎంపీకి నార్త్ స్టేట్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌వ‌ర్ ప్లాంట్లు ఉన్నాయి. ఆయ‌న‌పై ఇప్ప‌టికే బ్యాంకుల‌కు రుణాల ఎగ‌వేత‌కు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. మ‌రో ఎంపీకి కోట్లాది రూపాయ‌ల లిక్క‌ర్ బిజినెస్ ఉంది. ఈ క్ర‌మంలోనే వీరు త‌మ‌కు ఉన్న ప‌రిచ‌యాల‌తో నేరుగా ఢిల్లీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లోకి వెళుతుండ‌డం పార్టీకి నచ్చ‌లేద‌ట‌. దీంతో వీరు ఢిల్లీలో ఎవ‌రిని అయినా క‌ల‌వాల‌న్నా కూడా ఆంక్ష‌లు పెట్ట‌డంతో వీరు ర‌గిలి పోతున్నార‌ట‌.

ఈ నేప‌థ్యంలో ఆంక్ష‌లు విధించ‌డం, పార్టీలైన్ ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని చెప్ప‌డంతో తీవ్రంగా మ‌ద‌న ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఒక ఎంపీ పార్టీ లైన్‌ను దాటేశారు. పైగా స‌మ‌ర్ధించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రో ఎంపీ ఏకంగా పార్ల‌మెంటుకే ఇప్పటి వ‌ర‌కు హాజ‌రుకాలేదు. ఇటీవ‌ల పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం నిర్వ‌హించిన‌ప్పుడు కూడా ఈ ఇద్ద‌రు ఎంపీలు డుమ్మా కొట్టారు. దీంతో ఇక, ఆ ఇద్ద‌రు ఎంపీలు వైసీపీలో ఉంటారా?  లేక బీజేపీకి జైకొడ‌తారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వీరిపై వైసీపీ వ‌ర్గాల్లోనే అనుమానాస్ప‌ద చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఏపీలో పాగా వేసేందుకు ఏ చిన్న అవ‌కాశం వ‌దులుకోని బీజేపీ ఈ ఇద్ద‌రు ఎంపీల అస‌మ్మ‌తి క‌ద‌లిక‌ల‌ను కూడా ప‌సిగ‌డుతోన్న‌ట్టు టాక్‌..? 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English