క‌న‌క‌మేడ‌ల సాక్షిగా బీజేపీ-టీడీపీ బంధం పెన‌వేసుకుంటోందా..?

క‌న‌క‌మేడ‌ల సాక్షిగా బీజేపీ-టీడీపీ బంధం పెన‌వేసుకుంటోందా..?

టీడీపీ-బీజేపీల మ‌ధ్య బంధం బెడిసి కొట్టింది. దీంతో గ‌త పాల‌నా కాలంలో కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఇద్ద‌రు ఎంపీల‌ను టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు వెన‌క్కి తీసుకున్నారు. దేశం మొత్తం తిరిగి ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పారు. మోడీని వ్య‌తిరేకించిన వారితో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌లు ముగిశాయి. చంద్ర‌బాబు పార్టీ ఓట‌మి పాలై అధికారం కోల్పోయింది. దీంతో ఆయ‌న‌లో మ‌ద‌నం జ‌రిగింది. ఓట‌మికి బీజేపీకి దూరం కావ‌డం కూడా ఒక కార‌ణ‌మ‌ని ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

ప్ర‌జ‌లకోస‌మే తాను బీజేపీతో ర‌గ‌డ పెట్టుకున్నాన‌ని, త‌ప్పు చేశాన‌ని అనేశారు. ఆ వెంట‌నే ఆయ‌న ముంబై వెళ్లారు. అక్క‌డ ఆర్ఎస్ఎస్ నేత‌ల‌తో క‌లిశారు. త‌న త‌ప్పున‌కు చెంప‌లు వేసుకున్నారు. క‌ట్ చేస్తే.. బీజేపీతో టీడీపీ చెలిమికి బాట ప‌డింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. రాష్ట్రంలో బీజేపీని ఇక విమ‌ర్శించ‌డం మానేశారు. అంతేకాదు, ఇసుక దీక్ష చేసిన చంద్ర‌బాబు బీజేపీ నేత‌ల‌ను ఈ దీక్ష‌కు కూడా ఆహ్వానించారు. ఇక‌, దీంతో మ‌ళ్లీ బీజేపీ-టీడీపీల దోస్తీకి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేన‌న్న వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. అయినా కూడా ఎక్క‌డో కొంత అనుమానాలు నెల‌కొన్నాయి. ఇప్పుడు ఇవి కూడా చెరిగిపోయేలా.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం టీడీపీ నాయ‌కుడికి కీల‌క ప‌ద‌విని అప్ప‌గించింది.

కేంద్ర హోంశాఖ ఆధ్వ‌ర్యంలోని అత్యంత కీల‌క‌మైన సంప్ర‌దింపుల క‌మిటీలో టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడల ర‌వీంద్ర‌కుమార్‌కు తాజాగా చోటు ల‌భించింది. అయితే, ఇదేమీ .. రూల్స్ ప్ర‌కార‌మో.. లేక త‌ప్ప‌ద‌నో వ‌చ్చిందంటే.. పొర‌పాటే.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి ఇష్ట‌మైన వారిని మాత్ర‌మే నియ‌మించుకునే వెసులు బాటు ఉంది. ఈ నేప‌థ్యంలో క‌న‌క‌మేడల‌కు ఈ ప‌ద‌వి ఇచ్చారంటే.. వారు టీడీపీని ఇష్ట‌ప‌డుతున్న‌ట్టేన‌ని జాతీయ మీడియా కూడా వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా మ‌రో ఉదాహ‌ర‌ణ కూడా జాతీయ మీడియా చెప్పుకొచ్చింది.

మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వ ఏర్పాటులో స‌హ‌క‌రించ‌ని త‌మ మూడు ద‌శాబ్దాల మిత్ర‌ప‌క్షం శివ‌సేన‌ను అనూహ్యంగా ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షం నుంచి బీజేపీ తొల‌గించింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు లోక్ స‌భ‌లో త‌మ ప‌క్క‌నే సీట్లు కేటాయించిన బీజేపీ పెద్ద‌లు ఇప్పుడు ఈ పార్టీ ఎంపీల‌ను ప్ర‌తిప‌క్షం వైపు నెట్టేశారు. ఇదే బీజేపీ ఎన్నిక‌ల‌కు ముందు శివ‌సేన‌ను త‌మ‌కు న‌మ్మ‌క‌మైన మిత్ర‌ప‌క్షం అని.. టీడీపీని న‌మ్మ‌క ద్రోహి అని ప్ర‌క‌టించింది. సో.. ఇలా చేసిన బీజేపీ.. ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ ఎంపీని చంక‌నెక్కించుకోవ‌డం వెనుక మిత్ర‌రాగం ఉంద‌నే వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరుతోంద‌ని అంటున్నారు. మొత్తానికి మ‌ళ్లీ రాష్ట్రంలో బీజేపీ-టీడీపీలు క‌లిసిపోతున్నాయ‌నే వాద‌న‌కు ఈ ప‌రిణామం బ‌లం చేకూరుస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English