ఎన్టీఆర్ కుటుంబానికి టీడీపీ కలిసి రానట్లేనా?

ఎన్టీఆర్ కుటుంబానికి టీడీపీ కలిసి రానట్లేనా?

తెలుగు ప్రజల, జాతి ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన భార్యకు కానీ, కుమారులు, కుమార్తెలకు కానీ కలిసి రాలేదు. పార్టీని అల్లుడు చంద్రబాబు చేతుల్లోకి తీసుకుని ఏలుబడి సాగించారే కానీ ఎన్టీఆర్ ఇతర కుటుంబసభ్యులు మాత్రం ప్రాధాన్యం దక్కించుకోలేకపోయారు. ఇతర పార్టీల్లోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు గౌరవం దక్కిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

1982 మార్చి 29న  పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. అప్పట్లో 42 లోక్‌సభ స్థానాలకు గానూ 35 గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1988లో పార్టీ ఓడిపోయింది. మళ్లీ 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తదుపరి టీడీపీలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో 1995లో చంద్రబాబు అధికారం చేపట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి టీడీపీని చంద్రబాబునాయుడే ఏలుతున్నారు.

ఎన్టీఆర్ తర్వాత నందమూరి వారసులు చాలామందే పార్టీకి సేవలు అందించారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి, తనయులు హరికృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్, తనయ సుహాసిని.. ఇలా అందరూ పార్టీ కోసం పనిచేశారు. అయితే.. ఇందులో ఎవ్వరికీ కలిసిరాలేదనే చెప్పాలని అంటున్నారు రాజకీయ పండితులు. హరికృష్ణ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా.. రావాల్సిన గుర్తింపు రాలేదని, లక్ష్మీ పార్వతి సంగతి వేరే చెప్పక్కర్లేదని చెబుతున్నారు. ఆమెను పార్టీ నుంచే బహిష్కరించారని గుర్తు చేస్తున్నారు.

కుమార్తె పురంధేశ్వరి, అల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వర్‌రావు కూడా కొన్నాళ్లు పార్టీ కోసం పని చేశారని, ఆ తర్వాత దగ్గుబాటి పార్టీని వీడాల్సి వచ్చిందని వివరిస్తున్నారు విశ్లేషకులు. అన్నింటికంటే.. మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ భవిష్యత్తు క్రియాశీలక రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అందుకు తగ్గట్లే 2009 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాడు యంగ్ టైగర్.

 అయితే.. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ సేవలు టీడీపీకి అవసరం లేదని చంద్రబాబు సన్నిహితుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారంటేనే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా 2018 ముందస్తు ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు.

ఎన్టీఆర్ కుమారుల్లో హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా పనిచేయగా బాలకృష్ణ రెండు విడతలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరూ టీడీపీ నుంచే ఈ పదవులు అందుకున్నారు. బాలకృష్ణ తన ఇమేజ్‌తో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

కాగా టీడీపీలో ప్రాధాన్యం దక్కని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఇతర పార్టీల్లో ప్రాధాన్యం దక్కింది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చాలాకాలం వైసీపీలో ఉంటున్నారు. ఆమెను తెలుగు అకాడమీ చైర్మన్‌ను చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English