నరసాపురం ఎంపీకి వార్నింగ్ ఇచ్చిన జగన్?

నరసాపురం ఎంపీకి వార్నింగ్ ఇచ్చిన జగన్?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఇంగ్లిష్ మీడియం అమలుకు జగన్ నిర్ణయం తీసుకోగా పార్టీ లైన్‌కు భిన్నంగా ఎంపీ మాట్లాడడంతో జగన్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజు పార్లమెంటులో మాట్లాడుతూ తెలుగు భాషోన్నతికి కేంద్రం సహకరించాలని కోరారు.

ఆయనలా మాట్లాడడం విపక్ష తెలుగుదేశం చేతికి అస్త్రమిచ్చినట్లయింది. జగన్ పార్టీ ఎంపీయే తెలుగు భాష ఉన్నతిని కోరుతుండగా జగన్ మాత్రం తెలుగుని సమాధి చేస్తూ ఇంగ్లిష్‌ను రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. ఇదంతా రచ్చ కావడంతో జగన్ తాజాగా రఘురామ కృష్ణంరాజుకి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.

ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టింది పేదల పిల్లలకోసమేనని మరోసారి జగన్ బలంగా చెబుతూ.. ఇంగ్లీష్ మీడియంకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. గోదావరి జిల్లాల పార్టీ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డిని పిలిచి ఎంపీ తీరుపై జగన్ చర్చించినట్లు సమాచారం. రఘురామకృష్ణంరాజు నుంచి వివరణ తీసుకోవాలని జగన్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

కాగా రఘురామకృష్ణంరాజు దీనిపై ఇప్పటివరకు బయట ఎక్కడా స్పందించనప్పటికీ జగన్ హెచ్చరికలకు భయపడే వ్యక్తిని కానని తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. తానేమీ పదవులు కోరుకునేవాడిని కానని.. రాజకీయాలే తనకు జీవితం కాదని.. ఇంగ్లిష్ మీడియం విషయంలో ప్రజల మాటనే తాను పార్లమెంటులో వినిపించానని అన్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English