ఈ దూకుడేదో అప్పుడే ఉంటే బాగుండేదిగా ప‌వ‌న్‌..!

ఈ దూకుడేదో అప్పుడే ఉంటే బాగుండేదిగా ప‌వ‌న్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్రంలోను, కేంద్రంలో ను కూడా వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. ఇక్క‌డ జ‌రుగుతున్న విష‌యాల‌పై కేంద్రంలోని పెద్ద‌ల‌కు కూడా ఆయ‌న ఫిర్యాదు చేసిన‌ట్టు తాజాగా వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, ఇసుక స‌మ‌స్య‌, కార్మికుల ఆత్మహ‌త్య‌లు, తెలుగు మాధ్య‌మం తీసివేయ‌డం వంటి కీల‌క విష‌యాల‌పై ప‌వ‌న్ విజృంభిస్తున్నారు. లాంగ్ మార్చ్‌తో కూడా ఆయ‌న‌కు మంచి పేరే వ‌చ్చింది. జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు.

నిజానికి ఏ ప్ర‌తిప‌క్ష‌మైనా.. చేయాల్సింది ఇవే. ఈ విష‌యంలో ప‌వ‌న్ దూకుడును ఎవ‌రూ ప్ర‌శ్నించ‌డం లేదు. అయితే, ఆయ‌న వైఖ‌రినే ప్ర‌శ్నిస్తున్నారు. త‌న‌కు ఇష్ట‌మైన పార్టీ ప్ర‌భుత్వంలో ఉంటే.. ఆ ప్ర‌భుత్వం చేసిన త‌ప్పులు ప‌వ‌న్ కు క‌నిపించ‌లేదా ? అనేది నెటిజ‌న్ల మాట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఎక్క‌డ స‌భ పెట్టినా, మీడియా మీటింగ్ పెట్టినా.. లైవ్ వ‌స్తోంది. ఆ వెంట‌నే సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి సోష‌ల్ మ‌డియాలో కూడా అంతే సూటిగా వ‌స్తున్నాయి. ఇదే దూకుడు ఆనాడు(చంద్ర‌బాబు హ‌యాంలో) కూడా చూపించి ఉంటే బాగుండేదిగా ప‌వ‌న్? అని ప్ర‌శ్నిస్తున్నారు.

కానీ, ఆనాడు ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు గుప్పించి, జ‌గ‌న్‌ను టార్గ‌టె్ చేసుకున్న ప‌వ‌న్‌.. ఇప్పుడు కూడా జ‌గ‌న్ టార్గెట్‌గా రాజ‌కీయాలు చేస్తున్నార‌నే వాద‌న ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి రాష్ట్రంలో జ‌న‌సేన పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పార్టీ పుంజుకోకపోతే.. న‌డిపించ‌డం చాలా క‌ష్టమ‌నేది ఆ పార్టీ నేత‌ల్లోనే వినిపిస్తోంది. ప‌వ‌న్ పైకి అవ‌కాశ‌వాదులు పార్టీని వ‌దిలి పోతున్నార‌ని చెబుతున్నా.. ప్రాధాన్యం లేని పార్టీలో ఎవ‌రుంటారు? అనే ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఆయ‌న వ‌ద్ద కూడా స‌మాధానం లేదు. ఏ పార్టీ అయినా మ‌న‌గ‌ల‌గాలంటే. ఖ‌చ్చితంగా ప్ర‌జాద‌ర‌ణ ముఖ్యం.

ప్ర‌జాద‌ర‌ణ‌కు నోచుకోని పార్టీల ప‌రిస్థితి ప్ర‌జా స్వామ్యంలో ఏమ‌వుతోందో తెలియంది కాదు. కానీ, ఇప్పుడు ప‌వ‌న్ వేస్తున్న అడుగులు.. గ‌తాన్ని ప్ర‌శ్నించేలా ఉండ‌డ‌మే పార్టీకి చేటు తెస్తోంది. గ‌త తాలూకు విజ‌యం ఒక్క‌టైనా ఉంటే.. ఇప్పుడు పోరాడినా ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు. న‌దులు నిండిపోయి, వ‌ర‌ద‌లు పారుతున్న‌ప్పుడు ఇసుక ఎలా వ‌స్తుంద‌నే నిపుణుల మాట‌కు కూడా విలువ ఇవ్వ‌కుండా.. ఏదో చేయాలి కాబ‌ట్టి చేశాం. ఏదో అనాలి కాబ‌ట్టి అన్నాం.. అంటే.. ప‌రిస్థితి మారుతుందా ?  పార్టీ పుంజుకుంటుందా ?  దీనికి జ‌న‌సేనాని ఏమంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English