ఈట‌ల‌ మంత్రి ప‌ద‌విపై మ‌ళ్లీ ఊహాగానాలు..!

ఈట‌ల‌ మంత్రి ప‌ద‌విపై మ‌ళ్లీ ఊహాగానాలు..!

అధికార గులాబీ గూటిలో మ‌ళ్లీ ఈట‌ల ముచ్చ‌ట మొద‌లైంది. త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్‌మంత్రివ‌ర్గంలో మార్పులు చేర్పులు చేస్తార‌ని, ఈసారి ఈట‌ల‌ను త‌ప్పిస్తార‌నే టాక్ గులాబీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. మొత్తంగా ఇద్ద‌రు మంత్రుల‌ను త‌ప్పించేందుకు గులాబీ బాస్‌రెడీగా ఉన్నార‌ని, అందులో ఈట‌ల ఉంటార‌ని టీఆర్ఎస్ శ్రేణులు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. నిజానికి.. రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందు కూడా ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను తొల‌గిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ.. ఆ ఊహాగానాలు సీఎం కేసీఆర్ చెక్‌పెట్టారు. దీంతో అప్ప‌టి నుంచి ఈ ప్ర‌చారం ఆగిపోయింది.

తాజాగా మ‌ళ్లీ ఈట‌ల ప‌ద‌విపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ గుస‌గుస‌లు గులాబీవ‌ర్గాల్లోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అస‌లు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు సంబంధించి ఈ ప్ర‌చారం ప‌దేప‌దే ఎందుకు జ‌రుగుతుంద‌న్న‌ది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేద‌ని ప‌లువురు నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. అయితే, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు నాలుగు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు సీఎం కేసీఆర్‌. ఆ జిల్లా నుంచి కేటీఆర్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, గంగుల కమ‌లాక‌ర్‌ మంత్రులుగా కొన‌సాగుతున్నారు.

ఇందులో ఈట‌ల రాజేంద‌ర్‌ను త‌ప్పిస్తార‌ని, ఆ ప‌ద‌విని ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత‌కు ఇస్తార‌నే టాక్ గులాబీవ‌ర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు చెక్ పెట్టేందుకే గంగుల‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నార‌నే వాద‌న కూడా బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా వినిపిస్తున్న టాక్‌తో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అనుచ‌రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇక రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ధిక్కార స్వ‌రం వినిపించిన విష‌యం తెలిసిందే. గులాబీ జెండా ఓన‌ర్ల‌లో తానూ ఒక‌డిన‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో గులాబీ గూటిలో క‌ల‌క‌లం రేపాయి.

ఇక ఈట‌ల గులాబీ పార్టీలో కొన‌సాగ‌లేర‌ని, ఆయ‌న పార్టీని వీడ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం కూడా జోరుగా సాగింది. ఇదే స‌మ‌యంలో ఈట‌ల బాట‌లో మ‌రికొంద‌రు నాయ‌కులు కూడా ధిక్కార స్వ‌రం వినిపించారు. అయితే, రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఎలాంటి మార్పులు చేయ‌క‌పోవ‌డంతో ఈట‌ల ప‌ద‌విపై ఊహాగానాలు ఆగిపోయాయి. తాజాగా మ‌ళ్లీ సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గంలో మార్పులు చేస్తార‌ని, ఇద్ద‌రిని తొల‌గించేందుకు రెడీ అవుతున్నార‌ని, ఆ ఇద్ద‌రిలో ఈట‌ల ఉంటార‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. దీనిపై  ఈట‌ల ఎలా స్పందిస్తారో? చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English