ఇచ్చిన‌ట్లే ఇచ్చి ఇళ్లు ప‌ట్టాలు వెన‌క్కి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌కు క్షేత్ర‌స్థాయిలో జ‌రిగే ప‌రిస్థితులు తెలియ‌డం లేదా? అనే ప్ర‌శ్న‌లు క‌లుగుతున్నాయి. ఎందుకంటే ఆయ‌న ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌డం బాగానే ఉంది. కానీ అవి ప్ర‌జ‌ల‌కు చేరే వ‌ర‌కూ క‌లుగుతున్న ఇబ్బందుల గురించి ఆయ‌న వ‌ర‌కూ వెళ్తుందా? అన్న‌ది సందేహంగా మారింది. ఇటీవ‌ల జ‌గ‌న‌న్న కాల‌నీలంటూ పేద‌ల‌కు ప్ర‌భుత్వం ఇళ్ల స్థ‌లాలు కేటాయించింది. అందులోనే ప్ర‌భుత్వ సాయంతో ఇళ్లు నిర్మించి ఇస్తామ‌ని చెప్పింది. అందులో ల‌బ్ధిదారులు కూడా త‌మ వంతు వాటాగా కొంత సొమ్ము జ‌మ చేయాలి. మిగ‌తాది ప్ర‌భుత్వ‌మే ఆర్థిక సాయంగా అందిస్తుంది.

పేద‌ల‌కు ఇళ్ల కోసం జ‌గ‌న్ తెచ్చిన ఈ ప‌థ‌కం బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ స్థ‌లాల్లో ఇళ్ల కోసం పేద‌లు డ‌బ్బులెక్క‌డ నుంచి తెస్తారు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. చాలా మంది త‌మ ద‌గ్గ‌ర ఇల్లు క‌ట్టుకునే డ‌బ్బు లేద‌ని నిర్మాణాలు చేయ‌డం లేదు. దీంతో అధికారులు ల‌బ్ధిదారుల‌పై ఒత్తిడి తేవాల‌నుకున్నారు. అందుకే ఇల్లు క‌ట్ట‌నివారి నుంచి ప‌ట్టాలు వెన‌క్కితీసుకోవ‌డం మొద‌లెట్టారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఈ తంతు అన‌ధికారికంగా జ‌రుగుతుంద‌ని తెలిసింది. ఇలా స్థలాన్ని ఖాళీగా ఉంచ‌కూడ‌దంటూ హౌజింగ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు వెన‌క్కి లాగేసుకుంటున్నార‌ని తెలిసింది.

పైగా ల‌బ్ధిదారుల నుంచి ఓ ప్రొఫార్మా మీద సంత‌కం పెట్టించుకుని మ‌రీ స్థ‌లాలు వెన‌క్కి తీసుకుంటున్నారంటా. నేరుగా వాలంటీర్ల‌ను వాళ్ల ద‌గ్గ‌ర‌కు పంపించి సంత‌కాలు చేయిస్తున్నార‌ని స‌మాచారం. క‌లెక్ట‌ర్ గారూ మా మీద ద‌య‌తో ఇంటి స్థలం ఇచ్చారు కానీ ఇల్లు క‌ట్టుకునే స్థోమ‌త మాకు లేదు కాబ‌ట్టి మీకే తిరిగి ఇచ్చేస్తున్నాం అని రాసి ఉన్న దానిపై సంత‌కాలు చేయించుకున్న‌ట్లు తెలిసింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సీఎం జ‌గ‌న్ పేద‌ల‌కు ప‌ట్టాలిస్తే మ‌ధ్య‌లో హౌజింగ్ డిపార్ట్‌మెంట్‌లో అధికారుల‌కు ఇబ్బంటి ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇల్లు క‌ట్టుకోవ‌డం ఆల‌స్యం కావ‌డంతో త్వ‌ర‌గా గృహ ప్ర‌వేశాలు జ‌ర‌పాల‌నే ఒత్తిడి ఉన్న క‌లెక్ట‌ర్లు హ‌డావుడి ప‌డుతున్నార‌ని స‌మాచారం. అందుకే కిందిస్థాయి ఉద్యోగులు ల‌బ్ధిదారుల‌ను బెదిరించి మ‌రీ ఇంటి నిర్మాణం కోసం అప్పులు కూడా చేయిస్తున్నార‌ని తెలిసింది. ఇలా పేద‌ల‌కు ఇచ్చిన ప‌ట్టాల‌ను తిరిగి లాగేసుకోవ‌డం స‌రికాద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.