మోదీకి మళ్లీ క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు

మోదీకి మళ్లీ క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. గతంలో క్లీన్ చిట్ ఇస్తూ తామిచ్చిన తీర్పుపై రివ్యూ ఏమీ అవసరం లేదని చెప్పింది. రివ్యూ కోరుతూ వచ్చిన పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది. ఫ్రాన్స్ కంపెనీ దసో నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2018 డిసెంబరు 14న కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ తీర్పును రివ్యూ చేయాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు పిటిషన్లు వేశారు. అయితే, సుప్రీంకోర్టు మాత్రం తన గత తీర్పుకే కట్టుబడి రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చింది.

గత ఏడాది డిసెంబరులో సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది. రఫేల్ ఒప్పందంలో వాణిజ్య పక్షపాతం ఏమీ కనిపించలేదని, కాబట్టి వీటి కొనుగోళ్ల కేసులో జోక్యం చేసుకునేది లేదని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం నిర్ణయ ప్రక్రియను అనుమానించేందుకు కూడా ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టం చేసింది.  

మరోవైపు రఫేల్ ఒప్పందంపై ఆరోపణలు చేస్తూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చౌకీదార్ చోర్ అంటూ ఆరోపణలు చేయడం.. అది వివాదాస్పదం కావడం తెలిసిందే. దానిపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కోర్టునాశ్రయించారు. చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ ఆరోపణలు చేసి ఆ వ్యాఖ్యలను తమకు ఆపాదించడం విచారకరమని కోర్టు అప్పట్లో చెప్పింది. రాహుల్ గాంధీ దీనిపై క్షమాపణలు కూడా చెప్పారు. ఆయన క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు హెచ్చరించి వదిలిపెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English