తెలుగు యువతకు ఇప్పుడు దిక్కు ఎవరు...?

తెలుగు యువతకు ఇప్పుడు దిక్కు ఎవరు...?

తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ మార‌డం దాదాపు ఖ‌రారైన నేప‌థ్యంలో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీకి నమ్మకంగా ఉంటాడు అనుకున్న వ్యక్తి పార్టీ మారుతుండ‌డంతో కార్యకర్తల్లో ఒకరకమైన నిరుత్సాహం వ్యక్తమవుతోంది. ఆయన కోసం ఎంతో కష్టపడి పని చేసిన పలువురు కార్యకర్తలు ఈ పరిణామాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు.

సరే అది పక్కన పెడితే... ఇప్పుడు అవినాష్ తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకుంటున్నందున ఇన్నాళ్ళు  ఆయన బాధ్యతలు నిర్వహించిన తెలుగు యువత పరిస్థితి ఏంటి ? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. తెలుగు యువతకు పార్టీలో చాలా ప్రాధాన్యతే ఉంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి అక్కడి నుంచి తయారైన నాయకులే చాలా కీలకం అని చెప్పాలి. గుంటూరు జిల్లాలో తెలుగు యువ‌త నుంచే మంత్రుల స్థాయికి ఎదిగారు ఆల‌పాటి రాజా, న‌క్కా ఆనంద్‌బాబు.

ఇలా చాలా జిల్లాల్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు, ఆ త‌ర్వాత బాబు టైంలో తెలుగు యువ‌త అధ్య‌క్షులుగా ఉన్న వారే నేడు ఎమ్మెల్యేలు అయ్యారు. అలాంటి సమర్ధవంతమైన విభాగం నుంచి అవినాష్ వెళ్లిపోవడంతో పార్టీలో ఆ విభాగం పరిస్థితి ఏంటి అనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. తెలుగు యువత బాధ్యతలను ఇప్పుడు స్వీకరించడానికి, సమర్ధవంతమైన యువ నాయకత్వం పార్టీలో లేదు.

పరిటాల శ్రీరాం ఉన్నా సరే ఆయనకు పార్టీలో అంత ప్రాధాన్యత లేదు. ఇక్క‌డ పార్టీ యువ‌నేత‌ను మిగిలిన యువ నాయ‌కులు ఓవ‌ర్ టేక్ చేస్తున్నార‌న్న సందేహాలే అవినాష్ పార్టీ వీడ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. అప్పుడు దూకుడుగా ఉండే ప‌రిటాల‌కో లేదా మ‌రొక‌రికో ఈ ప‌ద‌వి ఇచ్చినా మ‌ళ్లీ అవే స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వ్వ‌వ‌ని గ్యారెంటీ లేదు. ఇక అఖిల ప్రియకు ఇచ్చే పరిస్థితి లేదు, ఇక రామ్మోహన్ నాయుడు ఎంపీ కాబట్టి ఆయనకు అవకాశం లేదనే చెప్పాలి. పైగా ఆయ‌న పేరు ఏపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వికి విన‌ప‌డుతోంది.

ఇక జేసి పవన్ కు ఆ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు... ఆ బాధ్యతలను ఆయన ఎంత వరకు నిర్వహిస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. పార్టీలో ఉండేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డం లేదంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి చింతకాయల విజయ్ కి గాని, శింగనమల నుంచి పోటీ చేసిన బండారు శ్రావణి కి గాని ఆ పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా పార్టీలో అవినాష్ లేని లోటును పూడ్చ‌డం అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌ష్ట‌మే..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English