కాపుల కోరిక తీర్చిన జగన్

కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసుల్లో చాలా వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.  తాజాగా 161 కేసులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వివరించాలని డీజీపీకి హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. 2016-19 మధ్య జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 329 కేసులు నమోదుచేసింది.

తమపై నమోదైన కేసులను ఎత్తేయాలని కాపు నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నేతల  విజ్ఞప్తి ప్రకారం 68 కేసులను ఉపసంహరించారు. మరో 85 కేసులు కింద స్ధాయిలోనే పరిష్కారమై పోయాయి. 176 కేసులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. వీటిల్లో రైల్వే ఆస్తులు ధ్వంసం కు సంబంధించి నమోదైన కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది.

సో పెండింగ్ లో ఉన్న 175 కేసుల్లో 161 కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 14 కేసుల దర్యాప్తు వివిధ దశల్లో ఉన్నాయి. కాపులకు బీసీల రిజర్వేషన్ వర్తింపచేయాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆందోళనతో మొదలైన ఉద్యమం తర్వాత పీక్స్ కు చేరుకుంది. ఆ సమయంలో తునిలో జరిగిన ఆందోళనలోనే రత్నాచల్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టడం దేశంలో సంచలనమైంది. వివిధ ఘటనల్లో కొన్ని వందల మంది కాపు యువతపై కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత కూడా ఉద్యమంలో భాగంగానే ఆందోళనకారులపై ప్రభుత్వం అనేక కేసులను పెట్టింది. రైలుదహనం ఘటనలో పోలీసులు చాలామందిపై కేసులు నమోదు చేసి విచారించారు. అయితే ఎవరు నిప్పుపెట్టారనే విషయం తేలలేదు. ఈ కేసును రైల్వే పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా దోషులెవరో తేలలేదంటే ఇక ముందు కూడా తేలే అవకాశం లేదు. ఇదే సమయంలో తమపై నమోదైన కేసులను ఎత్తేయాలంటు కాపు సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో అవకాశమున్న కేసులను ప్రభుత్వం తాజాగా ఎత్తేసింది.