వైసీపీకి కిషన్ రెడ్డి వార్నింగ్..

వైసీపీకి కిషన్ రెడ్డి వార్నింగ్..

ఏపీలో వైసీపీ నాయకుల తీరుపై కేంద్రం కూడా దృష్టి సారించే రోజొస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వైసీపీ దాడులపై టీడీపీ నుంచి తెగ ఫిర్యాదులొచ్చాయి. వైసీపీ బాధితుల శిబిరాలనూ టీడీపీ నిర్వహించింది. అంతేకాదు.. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు కారణం కూడా వైసీపీ వేధింపులేనని టీడీపీ ఆరోపించింది. ఎంతచేసినా.. టీడీపీ ఘోష అరణ్య రోదనే అయింది. ఆ తరువాత ఇసుక, ఇంగ్లిష్ మీడియం వంటి కొత్త ఇష్యూలు వచ్చి వైసీపీ దాడుల అంశం మరుగుననపడిపోయింది. కానీ... వైసీపీ దాడుల విషయం మరోసారి చర్చకొస్తోంది. పైగా ఈసారి కేంద్రం వరకు వెళ్తోంది.

బీజేపీ కార్యకర్తలపైనా వైసీపీ దాడులు చేస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసింది కూడా. దీంతో ఆయన మొదటి తప్పు కింద వార్నింగ్ ఇచ్చి వదిలారు. మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే చూద్దా అని ఆయన ఏపీ బీజేపీ నేతలతో అన్నట్లుగా తెలుస్తోంది.

బుధవారం విశాఖలో మాట్లాడిన కిషన్ రెడ్డి వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం మంచిది కాదని.. ఇకపై అలాంటి పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్యమత ప్రచారం, బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని.. అది సరికాదన్నారు.

కాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సహా మిగతా బీజేపీ నేతలంతా వైసీపీపై కిషన్ రెడ్డికి పలు అంశాలపై ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. మరో అవకాశం ఇచ్చి చూద్దామని.. అప్పటికీ మారకుంటే ఏం చేయాలో అది చేద్దామని ఆయన చెప్పినట్లుగా బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ నాయకులపై దాడులు జరిగితే మాత్రం సహించేది లేదని.. వెంటనే తన దృష్టికి తేవాలని ఆయన నాయకులకు చెప్పారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English