వంశీపై ఆశ‌ల్లేవ్‌...!

వంశీపై ఆశ‌ల్లేవ్‌...!

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై టీడీపీ ఆశ‌లు వ‌దిలేసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. పార్టీ ప్రాధ‌మిక స‌భ్య‌త్వానికి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో పాటు సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని క‌లిసిన వంశీ ఏపీ రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపారు. ఆ త‌ర్వాత తాను టీడీపీలో కొన‌సాగ‌లేన‌ని చంద్ర‌బాబుకు స్ప‌ష్టం చేయ‌డంతో పాటు వాట్సాప్‌లోనే బాబుకు త‌న రాజీనామా లేఖ పంపారు.

ఆ త‌ర్వాత వంశీ తన ఇబ్బందుల్ని ఏక‌ర‌వు పెట్ట‌డంతో పాటు తాను పార్టీలో ఇమ‌డ‌లేన‌ని కూడా పార్టీ నేత‌ల‌కు చెప్పేశాడు. చివ‌ర‌కు చంద్ర‌బాబు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితో పాటు మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ లాంటి వాళ్ల‌ను వంశీని బుజ్జగించేందుకు రాయ‌భారం పంపారు. అయితే వంశీ ద‌గ్గ‌ర ఈ బుజ్జ‌గింపులు ఎంత మాత్రం ఫ‌లించ‌లేదు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశానికి సైతం వంశీ డుమ్మా కొట్ట‌డంతో వంశీ పార్టీలో ఉండ‌డ‌న్న విష‌యం బాబుకు క్లారిటీ వ‌చ్చేసింది.

ఈ క్ర‌మంలోనే వంశీ పార్టీని వీడేందుకు దాదాపు డెసిష‌న్ తీసుకోవ‌డంతో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ అనాథ కాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబు ఓ క‌మిటీ కూడా వేశారు. బాబు సోమ‌వారం రాత్రి గ‌న్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పార్టీ నాయ‌కుల‌తో ప్రత్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు. వంశీ ఇబ్బందుల్లో ఉంటే తాము పార్టీ ప‌రంగా పూర్తి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

ఒక వేళ వంశీ వెళ్లినా మ‌న‌కు వ‌చ్చిన ఇబ్బందేమి లేదని... నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఎంత మాత్రం బ‌ల‌హీన‌ప‌డ కూడ‌ద‌ని సూచించారు. త్వ‌ర‌లో జ‌రిగే పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌ల్లో గ్రామ‌స్థాయి నుంచి మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి వ‌ర‌కు క‌మిటీల‌ను ఎన్నుకోవాల‌ని ఆయ‌న సూచించారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించాల‌ని మాజీ మంత్రి దేవినేని ఉమాకు కూడా చెప్పారు.

ఇక ఉమా సైతం నియోజ‌క‌వ‌ర్గంలో కొంద‌రు టీడీపీ నేత‌ల‌తో నేరుగా ట‌చ్‌లోకి వెళ్లిపోయారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే వంశీపై చంద్ర‌బాబు పూర్తిగా ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇక వంశీ పార్టీ నుంచి ఎప్పుడు బ‌య‌ట‌కు వెళ‌తాడో ? అన్న‌ది మాత్ర‌మే మిగిలి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English