నిన్న: తల్లిని చంపిన కూతురు.. నేడు: కూతురిని చంపిన తల్లి

నిన్న: తల్లిని చంపిన కూతురు.. నేడు: కూతురిని చంపిన తల్లి

గత నెలలో హైదరాబాద్‌లోని హయత్ నగర్‌‌లో జరిగిన ఒక ఘోరం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. తన వివాహేతర సంబంధానికి తల్లి అడ్డు వస్తోందని.. ప్రశ్నించిందని కూతురే ప్రియుడితో కలిసి ఆమెను చంపేసింది. మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రియుడితో గడిపింది. ఈ హత్యోదంతం ఎంతగా చర్చనీయాంశం అయిందో చూశాం.

ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా విజయవాడలో మరో హత్యోదంతం సంచలనం రేపుతోంది. అక్కడ వివాహేతర సంబంధం కారణంగా కూతురు తల్లిని చంపితే.. ఇక్కడ అదే కారణంతో ఎనిమిదేళ్ల తన కూతురిని తల్లి చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ ఉదంతం వివరాలేంటో చూద్దాం పదండి.

విజయవాడలో ద్వారక అనే మూడో తరగతి విద్యార్థిని కనిపించకుండా పోయినట్లుగా నిన్న మీడియాలో.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ అమ్మాయి ఆచూకీ కోసం అందరూ అప్పీల్ ఇవ్వడం చేశారు. కానీ ఈ రోజు ఆ పాప శవమై కనిపించింది. ఈ వార్త విని అయ్యో అనుకున్నారంతా. ద్వారకను చంపింది ఆమె ఉండే పక్క ఇంట్లోనే అద్దెకు ఉండే ప్రకాష్ అని వెల్లడైంది.

ఈ రోజు ఉదయం ఊరి నుంచి వచ్చిన ప్రకాష్ భార్య ఇంట్లో ఒక సంచిలో ఏదో ఉండటం గమనించే ఏంటా అని చూస్తే పాప శవం కనిపించింది. ఆమెను ప్రకాష్ చంపి చేతులు కాళ్లు విరిచి సంచిలో పెట్టి మూట కట్టినట్లు వెల్లడైంది. వెంటనే పొరుగు వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ప్రకాష్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ముందు డబ్బుకోసమో.. ఇంకో కారణంతోనో ప్రకాష్ ఆ పాపను చంపి ఉంటాడనుకున్నారు. కానీ ద్వారక తల్లి వెంకటరమణమ్మతో అతడికి వివాహేతర సంబంధం ఉందని.. వీళ్లిద్దరూ కలిసి ఉండగా చూసిందన్న కారణంతో ఆవేశంలో ఇద్దరూ కలిసి ఆ పాపను చంపేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాష్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. లెక్కకు మిక్కిలిగా రమణమ్మకు కాల్స్ వెళ్లినట్లు వెల్లడైంది. ఈ కేసుపై పోలీసులు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు చెప్పనున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English