మహారాష్ట్రలో మూడో కృష్ణుడు... ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం

మహారాష్ట్రలో మూడో కృష్ణుడు... ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో కీలక మలుపు తిరుగుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతున్న చర్యలు అంతకంతకూ జఠిలంగా మారుతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ ఆహ్వానిస్తే... తగినంత బలం లేని కారణంగా తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని కమలనాథులు చేతులెత్తేశారు. ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు గవర్నర్ ఆహ్వానం అందినా... ఫలితం లేకపోగా... తాజాగా గవర్నర్ ముచ్చటగా మూడో అతి పెద్ద పార్టీగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి ఆహ్వానం పంపారు. మరి ఎన్సీపీ అయినా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.

ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేయమని శివసేనను గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బలనిరూపణ కోసం ఆ పార్టీకి సోమవారం రాత్రి 7.30 గంటల వరకు గవర్నర్ సమయం ఇచ్చారు. ఆదివారం నుంచే ఇటు ఎన్సీపీతో, అటు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపిన శివసేన గడువు సమీపిస్తున్నా కూడా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా తమకు ఇచ్చిన గడువును మరో రెండు రోజులకు పొడిగించాలని శివసేన యువ నేత ఆదిత్య ఠాక్రే చేసిన విజ్ఝప్తిని గవర్నర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి గవర్నర్ కార్యాలయం నుంచి ఎన్సీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానం అందింది. దీంతో ఎన్సీపీ నేతలు హుటాహుటీన రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి 24 గంటల గడువు ఇస్తున్నట్లుగా గవర్నర్ తేల్చి చెప్పారు. అంటే మంగళవారం రాత్రి 8 గంటలలోగా ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా బలాన్ని కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 105 సీట్లు రాగా... ఆ తర్వాత బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిన శివసేనకు 56 సీట్లు, ఎన్సీపీకి 54 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... కనీస సీట్ల సంఖ్య 145గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ నుంచి ఆహ్వానం అందుకున్న ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... తనకున్న ఎమ్మెల్యేలతో పాటుగా మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు తమ మద్దతు కోసం యత్నించిన శివసేన కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తనకు అందిన ఆహ్వానం మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తే... వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్, ఎన్సీపీకి శివసేన ఏ మేరకు మద్దతు ఇస్తుందన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English