తెలుగు కోసం ఇంగ్లీష్ లో ట్వీట్లా... పీకే మార్కు పోరు ఇదే

తెలుగు కోసం ఇంగ్లీష్ లో ట్వీట్లా... పీకే మార్కు పోరు ఇదే

ఏపీలో ప్రస్తుతం ఆంగ్ల మాద్యమంపై ఓ రేంజిలో పోరు నడుస్తోంది. మధ్య తరగతి, సంపన్నుల పిల్లల మాదిరి పేదింటి పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమాన్ని చేరువ చేసేందుకు జగన్ సర్కారు... అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమ బోధనను తప్పనిసరి చేసే దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ సర్కారు తీసుకుంటున్న ఈ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ ఓ రేంజిలో విరుచుకుపడుతుంటే... తానేమీ తక్కువ తినలేదన్న రీతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలి పోరాటాన్ని మొదలెట్టేశారు. అయితే రాజకీయాల్లో అంతగా అనుభవం లేకనో, ఇంకే కారణమో తెలియదు గానీ... తెలుగు మాద్యమం కోసం పవన్ చేస్తున్న పోరు విమర్శల పాలవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయినా పోరాటంలోనూ విమర్శలు ఎదుర్కొనేలా పవన్ ఏం చేశారన్న విషయానికి వస్తే... ఆంగ్ల మాద్యమం ప్రవేశం కోసం జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయంపై పవన్ ట్విట్టర్ వేదికగా సోమవారం వరుస ట్వీట్లు సంధించారు. విపక్షంలో ఉండగా... వైసీపీ నేతలు, ప్రత్యేకించి ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు ఏం చేశారన్న విషయాన్ని ప్రస్తావించిన పవన్... తన తెలుగు మాద్యమం కోసం తాను చేస్తున్న పోరాటాన్నంతా ఆంగ్లంలో రాసి పారేశారు. తాను పోస్ట్ చేసిన వరుస ట్వీట్లన్నింటినీ ఇంగ్లీష్ లోనే రాసేసిన పవన్... ఎవరో చెప్పినట్టుగా చివరి ట్వీట్ ను మాత్రం తెలుగులో పోస్ట్ చేశారు.

అంతేకాదండోయ్... తాను సంధించిన ట్వీట్లను ఆంగ్లంలోనే రాసేసిన పవన్... వాటికి సాక్ష్యాలుగా గతంలో జగన్ తెలుగులో రాసిన ట్వీట్ ను, సాక్షి పత్రికలో తెలుగులోనే ప్రచురితమైన క్లిప్ ను కూడా పోస్ట్ చేశారు. తెలుగు మాద్యమం కోసం పోరాటం చేస్తున్నవారు సాధారణంగా తెలుగులోనే తమ వాదనలను వినిపించడం, తెలుగులోనే రాయడం జరుగుతుంది. అయితే పవన్ మాత్రం ఈ ప్రాథమిక విషయాన్ని మరిచిపోయారో, లేక అసలు ఆ విషయమే గుర్తుకు రాలేదో తెలియదు గానీ... తెలుగు కోసం తన పోరు మొత్తాన్ని ఆంగ్లంలోనే రాసి పారేశారు. ఇక పవన్ తన ట్వీట్లకు అంటించేసిన క్లిప్ లన్నీ కూడా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్లలోని ప్రతులనే వాడుకున్నారట. మొత్తంగా తెలుగు కోసం తనదైన శైలిలో పోరు సాగిద్దామని ఎంట్రీ ఇచ్చిన పవన్... ఆంగ్లంలో ట్వీట్లతో అడ్డంగా బుక్కైపోయారన్న వాదన వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English