మనోళ్లకు వార్నింగ్ ఇచ్చిన స్విస్ బ్యాంక్

మనోళ్లకు వార్నింగ్ ఇచ్చిన స్విస్ బ్యాంక్

ఎలా సంపాదించినా.. గుట్టుగా దాచుకునేందుకు ప్రపంచంలో అత్యంత భద్రతతో కూడిన బ్యాంకులుగా స్విస్ బ్యాంకులకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అందుకే జమానా నుంచి కాసిన్ని డబ్బులు కూడబెట్టి.. అందులో అక్రమం పాళ్లు ఎక్కువగా ఉన్నా.. ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నా.. తమ దగ్గరి సొమ్ముల్ని స్విస్ బ్యాంకుల్లో దాచేసుకునే తీరు మొదట్నించి ఉన్నదే.
అయితే.. తాజాగా స్విస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఏళ్లకు ఏళ్లుగా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహించే వారందరి మీద కొత్త పిడుగు పడింది.

దశాబ్దాల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా ఉండిపోయిన ఖాతాలకు సంబంధించి స్విస్ బ్యాంక్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తమ దగ్గర బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు దాచుకున్న వారు.. తాము నిర్దేశించిన సమయానికి రాని పక్షంలో సదరు ఖాతాలో ఉన్న సొమ్ముల్ని తమ ఖజానాలో వేసేసుకుంటామని స్విస్ ప్రభుత్వం షాకిచ్చింది. అంతేకాదు.. సదరు ఖాతాల్ని శాశ్వితంగా రద్దు చేసేస్తామని స్పష్టం చేసింది.

ఇలా మూతవేత ఎదుర్కొంటున్న ఖాతాలు దాదాపుగా 2600 వరకు ఉన్నాయి. వీటి విలువ దగ్గర దగ్గర రూ.300 కోట్లుగా చెబుతున్నారు. ఈ తరహా ఖాతాల్లో భారతీయులవి 12 కావటం గమనార్హం. అయితే.. తమ దగ్గరున్న 12 ఖాతాలకు సంబంధించి ఇప్పటివరకూ ఏ భారతీయుడు తమదేనని క్లెయిం చేసుకున్నది లేదు.

దీంతో.. ఈ ఖాతాలకు చెందిన వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మూసివేత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఖాతాల్లో కొన్ని బ్రిటీష్ సర్కారు దేశాన్ని పాలిస్తున్న నాటి నుంచి ఉన్నవి కూడా ఉన్నాయి. స్విస్ బ్యాంకుల రూల్స్ ప్రకారం 60 ఏళ్ల నుంచి ఖాతాదారుల నుంచి ఎలాంటి సమాచారం లేకుంటే.. దాన్ని ఎలాంటి చైతన్యం లేని ఖాతాగా లెక్కలోకి తీసుకుంటారు.

ఇలాంటి ఖాతాల సమాచారాన్ని స్విస్ ప్రభుత్వం 2015 నుంచి వరుసగా వెల్లడిస్తోంది. ఈ ఖాతాలకు చెందిన అసలు ఓనర్లు కానీ.. వారి వారసులు కానీ ముందుకొచ్చి తగిన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తే.. వారి ఖాతాల్లో ఉన్న నగదు.. బంగారు ఆభరణాల్ని అప్పగిస్తారు. ఒకవేళ.. సాక్ష్యాల్ని చూపించటంలో ఫెయిల్ అయితే మాత్రం స్విస్ ప్రభుత్వం ఆ సంపదనను తన ఖాతాలో వేసుకుంటుంది.

మన దేశానికి చెందిన పన్నెండు ఖాతాల్లో రెండు కోల్కతాకు చెందినవి కాగా.. ఒకటి డెహ్రాడూన్.. మరో రెండు ముంబయికి చెందిన పెద్దోళ్లవిగా చెబుతున్నారు. వీరికి ఈ డిసెంబరు నాటి వరకూ గడువు ఇవ్వనున్నారు. మరి.. ఆ లోపు వచ్చి తమకు చెందిన సొమ్ముల్ని తీసుకెళతారా? స్విస్ ప్రభుత్వానికే వదిలేస్తారా? అన్నది డిసెంబరు వరకూ వెయిట్ చేస్తే కానీ క్లారిటీ రాని పరిస్థితి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English