త‌ప్పించుకు తిరుగుతున్న మంత్రులు

త‌ప్పించుకు తిరుగుతున్న మంత్రులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల స‌మ్మె రోజురోజుకూ ఉదృతం అవుతోంది. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌న్న ప్ర‌ధాన డిమాండ్‌తో గ‌త నెల 5వ తేదీ నుంచి ప్రారంభ‌మైన కార్మికుల స‌మ్మెకు స‌క‌ల జ‌నులూ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా మంద‌లించింది. అనేక‌మార్లు మొట్టికాయ‌లు వేసింది. ఐఏఎస్ అధికారులు గంట‌ల‌కొద్దీ బోనులో నిల‌బ‌డాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అయితే.. ఇప్పుడు కార్మికుల స‌మ్మె కొత్త‌రూపు దాల్చుతుందనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే టార్గెట్‌గా ఉద్య‌మం కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఈ ప‌రిణామాలు అధికార పార్టీ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ప్ర‌భుత్వం, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్  ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ మాత్రం బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్‌కు స‌మీపంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. అక్టోబ‌ర్ 5వ తేదీ త‌ర్వాత కేటీఆర్ ఒక‌టి రెండు కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే హాజ‌ర‌య్యారంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

అలాగే.. మంత్రులు హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, శ్రీ‌నివాస్‌గౌడ్‌లు, ఈట‌ల రాజేంద‌ర్ త‌దిత‌రులు ఏదో ఒక‌రోజు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మంత్రుల‌కు చేదు అనుభ‌వం కూడా ఎదురైంది. ఈ క్ర‌మంలో కార్మికుల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌.. పోలీసుల అండ‌తో అక్క‌డి నుంచి జారుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లువురు మంత్రులు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది. మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, హ‌రీశ్‌రావు, శ్రీ‌నివాస్‌గౌడ్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో వీరంద‌రూ ఆర్టీసీ కార్మికుల‌తో క‌లిసి ఉద్య‌మించిన‌వాళ్లే. ఇక ఇందులో మంత్రి హ‌రీశ్‌రావు అయితే.. ఏకంగా తెలంగాణ మ‌జ్జూర్ యూనియ‌న్‌కు గౌర‌వ అధ్య‌క్షుడిగా కూడా కొనసాగారు. ఇలా ఆర్టీసీ కార్మికుల‌తో అంద‌రూ క‌లిసి న‌డిచిన వారే.  ఇప్పుడు కార్మికుల‌కు వారు స‌మాధానం చెప్ప‌లేక‌, గులాబీ బాస్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ను జ‌వ‌దాట‌లేక‌.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇప్ప‌టికే ఆర్టీసీ జేఏసీ ప్ర‌జాప్ర‌తినిధుల ఇళ్ల ముందు ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటాయో ? చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English