కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంకా గాంధీ?

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంకా గాంధీ?

సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు.. రాహుల్ గాంధీ రాజకీయ వైరాగ్యంతో ధ్యానం పేరుతో దేశాలు తిరుగుతున్నారు. దేశంలో ఏం జరుగుతున్నా ఆయన ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిక్కూమొక్కూ లేకుండా సాగుతోంది. ఈ పరిస్థితి ఆ పార్టీ సీనియర్లను, కాంగ్రెస్ కుటుంబ వీర విధేయులను తీవ్రంగా వేధిస్తోంది.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీ, మోదీ చెబుతున్న కాంగ్రెస్ ముక్త భారత్ అనేది త్వరలోనే జరిగిపోతుందని భయపడుతున్నారు. అది కూడా బీజేపీ ఏమీ చేయకుండానే కాంగ్రెస్ తన చావు చస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీలోని కొందరు పెద్దలు కొద్దిరోజులుగా తీవ్ర మేథోమథనం జరుపుతున్నారు. సోనియా కుటుంబం నుంచే ఒక ఫేస్ ఉన్నప్పుడే పార్టీ బతుకుతుందని.. లేదంటే, పార్టీ మనుగడ కష్టమని ఆ మేథమథనాల్లో తేల్చి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారట.

కాడి పక్కన పడేసిన రాహుల్ గాంధీని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారట. అదేసమయంలో రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ అలియాస్ ప్రియాంకా వధేరా కూడా పార్టీలో యాక్టివేట్ అవుతుండడంతో ఆమెను కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రియాంక పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో మరింత క్రియాశీల పాత్రను పోషించేందుకు సిద్దమవుతున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో ఎవరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రియాంకే ఆదేశించారు.

పార్టీ వైఖరిని ప్రకటించే వరకు బహిరంగ ప్రకటనలు చేయవద్దని కూడా ఆమె హెచ్చరించారు. ఒక్క ఉత్తర ప్రదేశ్‌లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయంగా ప్రభావం చూపే అయోధ్య తీర్పు వంటి విషయాల్లో నిజానికి పార్టీ అధ్యక్షురాలి హోదాలో సోనియా గాంధీ లేదా సీడబ్ల్యూసీ ఇలాంటి ప్రకటన చేయాలి. కానీ ప్రియాంక ఆ బాధ్యతలను తన భుజానికి ఎత్తుకున్నారు.

ఇంతకుముందు ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు స్పందించి అభాసుపాలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అందుకే ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ప్రియాంక చొరవ తీసుకుని పార్టీకి ఆదేశాలు జారీ చేశారు. సోనియా, రాహుల్ కంటే క్రియాశీలంగా ఉన్నారనడానికి ఇదే సంకేతం.

మరో వంక ప్రియాంకకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రచారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. నిజానికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సమయంలో పార్టీ సీనియర్ నేతలు కరణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పార్టీ ఎంపీ శశి థరూర్ వంటి నేతలు చాలా మంది ప్రియాంకా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని ప్రతిపాదించారు.

ఆమె అయితేనే పార్టీ ఐక్యంగా ఉంటుందని, లేదంటే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉంటుందని కరణ్ సింగ్ వంటి కొందరు నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా గట్టిగా ప్రచారం చేశారు. అయితే, ఎందుకనో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సీనియర్లు ప్రియాంక వైపు మొగ్గు చూపలేదు. అప్పట్లో ప్రియాంక కూడా అంతగా ఉత్సాహం చూపలేదు. అదే సమయంలో జరిగిన పార్టీ ప్రాధాన కార్యదర్శుల సమావేశంలో ప్రియాంక గాంధీ తనను వదిలేయాలని, తనకు అలాంటి ఆలోచనలు లేవని చెప్పారు.

చివరకు సోనియా గాంధీనే తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. కానీ... తల్లి కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో ప్రియాంకలో ఇప్పుడు ఆసక్తి మొదలైందని తెలుస్తోంది. ఇందుకు ఆమె భర్త రాబర్ట్ వధేరా ప్రోద్బలమూ ఉందని సమాచారం.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English