గొంతెత్తి చెబితే పోయేదేం లేదు...

గొంతెత్తి చెబితే పోయేదేం లేదు...

ఎన్నడూ లేనిది ఈ సమయంలో నీలో ఎందుకీ నిరసన స్వరం ? తెలంగాణా సోదరులంతా నిన్ను "మిస్అండర్‌స్టాండ్" చేసుకోరా అని ప్రేమతో అంటున్న తెలంగాణా మిత్రులకి...ఒకటే సమాధానం. ముద్దముద్దకీ బిస్మిల్లా అనలేం. అపోహలని నివృత్తి చేయడానికి మా జీవితకాలాన్ని వెచ్చించలేం. ఈ నిరసన తెలంగాణా పట్లగానీ, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపట్లగానీ, ఏర్పరుస్తున్న విధానంపట్లకూడా కాదని మీకు స్పష్టంగా తెలుసు. ఈ నిరసన నయాపైసా విదల్చని కేంద్రప్రభుత్వం మీద. సీమాంధ్రులు మనుషులే కాదన్నట్లు వ్యవహరిస్తున్న ఉదారవాదులమీద. మరి మీవాళ్ళెందుకు ఇవాళ్టిదాకా ఏంకావాలో అడగలేదు అనడం వితండవాదం. వాళ్ళు విడిపోవాలనుకోలేదు. విడిపోయే క్షణం ఖరారు అయ్యేప్పుడే మాకు కనీసన్యాయం చేయమని అడుగుతున్నారు.

తెలంగాణా హక్కుల కోసం ఇప్పటిదాకా లక్షలగొంతులు మోగాయి. మీగొంతులు మోగినప్పుడు మేమూ ఆసరా ఇచ్చాం. ఇయ్యాల మావోళ్ళ కోసం మేము మాట్లాడాల. చేలకు పోయి గడ్డిమోపులు కోసి తెచ్చుకుని, బర్రెగొడ్లపాలు పాలకేంద్రాలకి పోసుకుని, కలుపులకి, నాట్లకి, కళ్ళాలకి కూలికి పోయి సంసారాలీడుస్తూ పిల్లలని చదివించుకున్న కోట్లాదిమంది మా అమ్మలు దోపిడీదార్లు కాదని మేము గొంతెత్తి తెలియజెప్పాల ఇయ్యాల. పక్క రైతు చేనికి పనికి "బదులు" పోతే ఒక కూలీ మిగులుద్దని, తమవంతు వాటాగా వచ్చే కాల్వనీళ్ళు ఉన్న ఎకరం ముక్కకి పెట్టుకోడానికి అర్ధరాత్రుళ్ళు పురుగుపుట్రా, చలిని లెక్కచేయకుండా పొలాలమీద కష్టపడ్డ కోట్లాదిమంది మా అయ్యలకి తెలంగాణాతో ఏ సంబంధంలేదని ఎవరి అవకాశాల్ని వాళ్ళు దొంగిలించలేదని ఇయ్యాల మేము గొంతెత్తి అరవాల. ఇది దిగువ మధ్యతరగతి సన్నకారు రైతుల వ్యధ. దళితులు, వెనుకబడిన వర్గాలు, చేతివృత్తులవారివి ఇంతకన్నా దుర్భరమైన బతుకులు. రాస్తే బండ్లకొద్దీ పుస్తకాలవుతాయి. చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల నిద్రలేని రాత్రులవుతాయి. రెవెన్యూ లోటంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఆర్ధికశాస్త్రాలు చదువుకోలేదు వాళ్ళు.

ఎన్నారైలుగా, చదువుకున్నోళ్ళుగా మీరు మీప్రాంతపు బాధలు చెప్పినట్లే రేఖకి ఇవతల నిందలకి, నిర్లక్ష్యానికి గురవుతున్న మా తల్లిదండ్రులు, మా సోదరుల గురించి మేము మాట్లాడాల. డిగ్రీదాకా చదువుకోగలిగితే బాలానగర్ అట్టపెట్టెల ఫాక్టరీల్లో ఉద్యోగానికి, పదోతరగతి తప్పితే అమీర్‌పేట మెస్సులో కూలీకి పోతున్న మా (శ్రీకాకుళం)బిడ్డలు కూడా గతిలేకనే వలసపోయారని, ఏ దురాక్రమణకీ కాదని చెప్పాల. ఇయ్యాల మాట్లాడకపోతే మేము చరిత్రహీనులం అవుతాం. ఇదే సందర్భం. ఇదే వేదిక. మీ బిడ్డలు ఉద్వేగంలో, బాధలో బలిదానాలు చేసుకున్నందుకు మనమందరం బాధపడ్డాం. మా బిడ్డలు రేపు ఉపాధి దొరక్క బలవుతుంటే మేము మాట్లాడకుండా చూస్తా ఊరుకోలేము. ఎవరి మనోభావాలో దెబ్బతింటాయని వివరణలిస్తూ పోలేం. మనసుంటే మీరూ వినండి. నాణేనికి రెండోవేపు నిజాన్ని తెలుసుకుని గుండె చెమ్మగిల్లితే మీ కల ఈడేరుతున్న సమయాన మావాళ్ళకి కనీస న్యాయం జరగాలని కోరుకోండి. ఎవరేమనుకున్నా పర్వాలేదు. మేము మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరిగేదాకా గొంతెత్తుతూనే ఉంటాం. అది విద్వేషపు ప్రాతిపదికనో, ఉక్రోషపు బాధతోనో కాదు. మా ప్రాంతప్రజల హక్కుల కోసం.

** గొంతెత్తి చెబితే పోయేదేం లేదు. మహా అంటే మూడు పలకరింపులు, నాలుగు డిన్నర్ పార్టీలకి పిలుపులు తప్ప **                                                                                   ...Feelings of a RoyalAndhra NRI 

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English