కోర్టులో మూడున్న‌ర గంట‌లు నిలుచున్న ఐఏఎస్‌లు...కేసీఆర్ ఎఫెక్ట్‌

 కోర్టులో మూడున్న‌ర గంట‌లు నిలుచున్న ఐఏఎస్‌లు...కేసీఆర్ ఎఫెక్ట్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం ఫ‌లితంగా...సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఎలాంటి ఇక్క‌ట్ల పాల‌వుతున్నార‌ని తెలుసుకునేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌. గులాబీ ద‌ళ‌ప‌తి నిర్ణ‌యాల ఫ‌లితంగా ఒక‌టి కాదు రెండు కాదు...ఏకంగా మూడున్న‌ర గంట‌ల పాటు...సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు...కోర్టులో నిలబడే ఉండిపోయారు. ఆర్టీ స‌మ్మె నేప‌థ్యంలో...కోర్టు విచార‌ణ సంద‌ర్భంగా ఐఏఎస్‌ల‌కు ఈ ప‌రిస్థితి ఎదురైంది.  

ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. విచారణకు హాజరైన సీనియర్ ఐఏఎస్‌లు మూడున్నర గంటలపాటు హైకోర్టుకు వివరణ ఇస్తూ నిలబడి ఉన్నారు.దీంతోపాటుగా సీనియ‌ర్ అధికారుల‌కు కోర్టు అనేక ద‌ఫాల్లో అక్షింత‌లు వేసింది.


 ఆర్టీసీ సమ్మెను విరమింపజేసి ప్రజలకు రవాణాసౌకర్యాలు మెరుగయ్యేలా చూడాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం మరోమారు విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ స్వయంగా విచారణకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా.. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఇచ్చిన అఫిడవిట్లతో మీరు సంతృప్తి చెందారా? అని సీఎస్ జోషిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను సంతృప్తి చెందానని, గతంలో కొన్ని లోటుపాట్లను సరిచేసుకుని ప్రస్తుతం కచ్చితమైన వివరాలతో అఫిడవిట్లు సమర్పించారని సీఎస్ ధర్మాసనానికి నివేదించారు.

దీంతో ధ‌ర్మాసనం ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. మొదట ప్రమాణం చేసి ఇచ్చిన అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చామని ఒప్పుకొంటున్నారా? మొదట ఇచ్చింది తప్పయితే ఈ అఫిడవిట్లను మేం ఎలా నమ్మాలి? రికార్డుల సూక్ష్మ పరిశీలన అని ఒకసారి, మైక్రోస్కోపిక్ పరిశీలన అని ఇంకోసారి చెప్తారా? అఫిడవిట్ అంటే ఏమిటో తెలుసా? హైకోర్టుకు తప్పుడు లెక్కలు ఎలా ఇస్తారు? ప్రమాణం చేసి తప్పుడు ప్రకటన చేయడం, కోర్టును తప్పుదోవ పట్టించడం నేరం.

దీనిని మేం ధిక్కరణ కింద పరిగ ణిస్తే ఏమవుతుంది? సీనియర్ ఐఏఎస్‌లు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇలా అబద్ధాలు చెప్తారని మేం ఊహించలేదు అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు తప్పుడు లెక్కలు ఎలా ఇస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ లెక్కలతో ఉన్నతాధికారులు రవాణాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారని అసహనం వెలిబుచ్చింది. ఇంతకుముందు సమర్పించిన అఫిడవిట్లలోని లెక్కలకు, ప్రస్తుత అఫిడవిట్లలోని లెక్కలకు తేడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

కాగా ఆర్టీసీపై నిర్ణ‌యం ముఖ్య‌మంత్రిది...దాని ఫ‌లితం ద‌క్కేది కార్మికుల‌కు....ఇటు కార్మికులు అటు స‌ర్కారు మొండిప‌ట్టు వీడ‌ని ప్ర‌స్తుత త‌రుణంలో..తాము కోర్టుల్లో దోషులుగా నిల‌బ‌డి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌స్తోంద‌ని...స‌మాధానాలు చెప్పుకుంటున్నామ‌ని...ఐఏఎస్‌లు మ‌థ‌న‌ప‌డిపోతున్న‌ట్లు...ప్ర‌చారం జ‌రుగుతోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English