వరుణ్ తేజ్ మెగా ప్రయోగం?

టాలీవుడ్ వారసత్వ హీరోల్లో వరుణ్‌ తేజ్‌ది సెపరేట్ రూట్. మంచి మాస్ హీరో కావడానికి తగ్గ కటౌట్ ఉన్నప్పటికీ.. అతను మాత్రం ‘ముకుంద’ లాంటి క్లాస్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కూడా కంచె, ఫిదా, అంతరిక్షం లాంటి రొటీన్‌కు భిన్నమైన సినిమాలే చేస్తూ ముందుకు సాగాడు. మధ్య మధ్యలో లోఫర్, మిస్టర్ లాంటి మాస్ టచ్ ఉన్న సినిమాలు చేసినా.. ప్రధానంగా అతను క్లాస్, డిఫరెంట్ మూవీసే చేస్తున్నాడు.

త్వరలోనే గని, ఎఫ్-3 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్.. వీటి తర్వాత చేయబోయే కొత్త సినిమా విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఈసారి అతను మరో ప్రయోగం చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో వరుణ్ కొత్త సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. వరుణ్ చేయబోయే తొలి పాన్ ఇండియా మూవీ ఇదే అని కూడా అంటున్నారు.

భారత సైన్యానికి సంబంధించి ఏ హీరోయిక్ మూమెంట్ ఉన్నా వదలకుండా బాలీవుడ్ వాళ్లే సినిమాలు చేసేస్తుంటారు. యురి, షేర్షా లాంటి సినిమాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటు చేసుకున్న బాలాకోట్‌లో భారత ఎయిర్ ఫోర్స్ చేసిన ఎయిర్ స్టైక్స్ గురించి కూడా మీడియాలో గొప్పగా వార్తలొచ్చాయి.

దీని మీద ఇంకా బాలీవుడ్లో సినిమా రాకపోవడం ఆశ్చర్యమే. ఐతే ఈలోపే టాలీవుడ్ దృష్టి దాని మీద పడ్డట్లు తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడు దీని మీద కథ తయారు చేశాడని.. వరుణ్ తేజ్ హీరోగా ఒక పేరున్న నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చిందని.. వరుణ్ కటౌట్‌కు ఎయిర్ కమాండర్ పాత్ర చాలా బాగుంటుందని, అతడి ఇమేజ్ పెంచేలా ఈ సినిమా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం