ఎక్కడ తాళం అక్కడే

 ఎక్కడ తాళం అక్కడే

గడుసుతనానికి కేరాఫ్ అడ్రస్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని చెప్పుకోవచ్చు. ఎక్కడ వేయాల్సిన తాళం అక్కడ వేయటంలో ఆయనకు మించిన ఘనాపాఠి మరోకరు ఉండరేమో. భావోద్వేగాలతో రాష్ట్రంలో వివిధ ప్రాంత ప్రజలు భిన్నాభిప్రాయాలతో ఉంటే.. అందరి మనసు దోచుకోవాలన్న తపన కిషన్ రెడ్డిలో కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ గురించి గొంతులు చించుకొని మరీ మాట్లాడే ఆయన ఆంధ్ర.. సీమ ప్రాంతాల వైపు వెళ్లినప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడతారు. హైదరాబాద్ లో తెలంగాణ అంశంపై విరుచుకుపడే ఆయన.. తెలంగాణ కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు సంయమనంతో వ్యవహరిస్తుంటారు.

తాజాగా తన గడుసు రాజకీయాన్ని మరోసారి ఆయన ప్రదర్శించటానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయటానికి వీలుగా ఆయన త్వరలో బస్సు యాత్ర చేయాలని భావిస్తున్నారు. ఆగస్టు లేదంటే సెప్టెంబరులో యాత్రను మొదలుపెట్టాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన అజెండా కూడా దాదాపుగా ఖరారు చేశారు. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ బస్సుయాత్రను తెలంగాణ...సీమాంధ్రలలోని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగేటట్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పనులు చూసేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన ఉద్యమ కమిటీలకు పనులు అప్పగించేశారు. యాత్ర చేసే మార్గాన్ని తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమ నేతలు నిర్ణయించనున్నారు.

అన్నింటికంటే విశేషమేమంటే.. రెండుప్రాంతాల్లో ఒకేసారి యాత్ర అన్నప్పుడు ఏ నినాదం తీసుకొని వెళతారు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ముందే చెప్పినట్లు బీజేపీ మహా గడుసు పార్టీ కదా... అందుకని.. తెలంగాణలో తెలంగాణ నినాదంతో ముందుకెళ్లి.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ వెను వెంటనే వస్తుందని.. అందుకే తమ పార్టీకి తెలంగాణ ప్రజలు మద్ధతు ఇవ్వమని కోరనున్నారు. మరి..

తెలంగాణ గురించి అంతలా మాట్లాడి సీమాంధ్రలో అడుగుపెడితే అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందన్న సందేహ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కమలనాథులు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. దాని ప్రకారం సీమాంధ్రలో యాత్ర జరిగేటప్పుడు యూపీఏ వైఫల్యాలు.. ఎన్డీఏ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ఏకరవు పెట్టనున్నారు. పనిలో పనిగా... వీలైతే... రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఏవిధంగా సాగుతుందో వివరించే ప్రయత్నం చేస్తారట. ఎంతైనా.. ఎక్కడ తాళం అక్కడ వేయటంలో కిషన్ రెడ్డి తర్వాతే ఎవరైనా.. కాదంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు