శివసేనకు ఊహించని షాకిచ్చిన శరద్ పవార్

శివసేనకు ఊహించని షాకిచ్చిన శరద్ పవార్

మహారాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పి బీజేపీకే షాకివ్వాలని ప్రయత్నాలు చేసిన శివసేనకు అక్కడి మరో పార్టీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భారీ షాకిచ్చారు. అతిపెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజారిటీ లేకపపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం మిత్రపక్షం శివసేన మద్దతు కోసం చూసిన బీజేపీని శివసేన ఆటాడుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి తమకిస్తేనే మద్దతిస్తామంటూ మెలిక పెట్టి సంక్షోభం సృష్టించింది శివసేన.

ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీకి హెచ్చరికలూ పంపింది. ఆ క్రమంలో తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవార్ తాము శివసేనకు మద్దతివ్వబోమని తెగేసి చెప్పేశారు. అంతేకాదు.. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోమని సలహా కూడా ఇచ్చారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ రోజు మరోసారి సమావేశమయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరం శరద్ పవార్ మీడియాతో మాట్లాడి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. శివసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో పాటు మా పార్టీ ఎన్సీపీ విపక్షంలో కూర్చుంటుందని తెలిపారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పని, దానికి కట్టుబడి ఉంటామని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. శివసేనతో కలవబోమని అన్నారు. బీజేపీతో కలిసే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు.

త్వరలో జరగనున్న రాజ్యసభ సమావేశాలపై సంజయ్ రౌత్ తనతో చర్చించారని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించామని చెప్పారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశమే లేదని ఆయన చెప్పేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English