ఏపీలో ఏం జ‌రుగుతోంది...? కంపెనీల ప‌రుగో ప‌రుగు !!

ఏపీలో ఏం జ‌రుగుతోంది...? కంపెనీల ప‌రుగో ప‌రుగు !!

ఏపీలో ఏం జ‌రుగుతోంది ?  ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఈ రాష్ట్రంపై చ‌ర్చ సాగుతోంది. దీనికి కార‌ణం ఉంది. ఏపీలో భారీ ఎత్తున పెట్టు బ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన‌ చాలా కంపెనీలు.. ఇప్పుడు వెను దారి ప‌ట్టాయి. వాస్త‌వానికి పెట్టుబడులు పెట్ట కుండానే స‌ద‌రు ఒప్పందాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాయి.

దీంతో ఏపీలో ఏం జ‌రుగుతోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు పాల‌న స‌మ‌యంలో విశాఖ వేదిక‌గా ఏటా జ‌న‌వ‌రిలో పెట్టుబ‌డుల స‌ద‌స్సును నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే కొన్ని ప్ర‌సిద్ధ కంపెనీలు వ‌చ్చి ప్ర‌భుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.

రాబోయే 20 ఏళ్ల‌లో ఏపీలో భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ప్ర‌భుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇలా ముందుకు వ‌చ్చిన కొన్ని కంపెనీల‌కు ఆస‌క్తి చూపిన వాటికి కొన్ని జిల్లాల్లో భూములు కూడా కేటాయించింది. కొన్నింటికి ఉచితంగానే భూములు కేటాయించ‌గా.. మ‌రికొన్ని సంస్థ‌ల కు ఎక‌రం రూపాయి ధ‌ర‌కే కేటాయించిన ప‌రిస్థితి ఉంది. అయితే, ఇప్పుడు స‌ద‌రు కంపెనీలు ఈ ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే సింగ‌పూర్ కు చెందిన కంపెనీ రాజ‌ధాని నుంచి త‌ప్పుకొంది. అదేవిధంగా ఆదానీ కంపెనీ దాదాపు 20 ఏళ్ల‌లో 72 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకుని ఇప్పుడు కేవలం 20 వేల కోట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతామ‌ని పేర్కొంది.

తాజాగా  రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఏపీలో పెట్టుబడుల నుంచి త‌ప్పుకొనేందుకు రెడీ అయింది. మొత్తం రెండు ఒప్పందాల్లో ఒకటిని రద్దు చేసుకుంది. తిరుపతి సమీపంలో ఏకంగా 15వేల కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ ఆలోచనను రిలయన్స్ విరమించుకున్నట్టు తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం రిలయన్స్ కు కేటాయించిన తిరుపతిలోని 150 ఎకరాలను తిరిగి తీసుకునేందుకు వైసీపీ సర్కారు రెడీ అయ్యింది.

ఇక కాకినాడలో చమురు సహజ వాయువు ఉత్పత్తి పరిశోధనను మాత్రం కొనసాగించేందుకు రిలయన్స్ సిద్దమైంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి దృష్టీ ఏపిని ఆక‌ర్షిస్తోంది. ఇలా ఎందుకు జ‌రుగుతోంది? ప‌్ర‌భుత్వ లోప‌మా?  లేక ప్ర‌భుత్వం ఆస‌క్తి చూపించ‌డం లేదా?  లేక మ‌రేదైనా కార‌ణాలా? అనే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉదారంగా అనుమ‌తులు ఇచ్చింది. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం స్థానికుల‌కు 75 శాతం ఉద్యోగాలు క‌ల్పించాల్సిందేన‌ని ష‌ర‌తు విధించ‌డం పెను సంచ‌ల‌నంగా మారింది.

మిగిలిన వాటి ప‌రిస్థితి ఓకే అయినా.. ఈ విష‌యంలో మాత్రం ప‌రిశ్ర‌మ‌లు ఒకింత ఇబ్బందిగానే ఉన్నాయి. అదే స‌మ‌యంలోరాజ‌ధాని విష‌యంపై క్లారిటీ లేక పోవ‌డం కూడా ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. పైగా దేశ‌వ్యాప్తంగా ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం కూడా పెట్టుబ‌డులు పెట్టేవారికి ఆటంకంగా మారింది. దీంతో మొగ్గ‌ద‌శ‌లో ఉన్న ఏపీ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English