కొత్త ఇండియా మ్యాప్‌: ఏపీ ప్రజలకు ఘోర అవమానం

కొత్త ఇండియా మ్యాప్‌: ఏపీ ప్రజలకు ఘోర అవమానం

మోదీ సారధ్యంలోని ఎన్టీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువు దీరినప్పటి నుంచి నవ్యాంధ్రప్రదేశ్‌కు ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అస్సలు పట్టించుకోకపోగా, నిధులు సక్రమంగా మంజూరు చేయకపోవడం సహా ఎన్నో విషయాల్లో మోదీ సర్కారు మెలికలు పెడుతూనే ఉంది.

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. కేంద్ర సహకారం లేకపోయినా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు పాలన చేస్తున్నాయి. ఇక, తాజాగా మరో విషయంలో సైతం ఏపీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఘోరంగా అవమానించింది.

కొద్ది రోజుల క్రితం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని ఫలితంగా అక్టోబర్ 31 నుంచి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త భారతదేశ పటాన్ని విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మ్యాప్‌ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏపీకి రాజధానిని చూపించకపోవడమే. పక్క రాష్ట్రం తెలంగాణ సహా అన్నింటికి రాజధానిని భౌగోలికంగా చూపించడంతో పాటు పేర్లను కూడా ఉంచారు. కానీ, ఏపీ విషయంలో అలా జరగలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే చూపించారు. దీంతో ఏపీ ప్రజలతో పాటు తెలుగు వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతిని రాజధానిగా ప్రకటించిన దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది. అంతేకాదు, అక్కడ ప్రధాన భవనాల నిర్మాణం కూడా జరిగింది. అంతకంటే ముఖ్యంగా రాజధాని ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. అయినా.. మ్యాప్‌లో చూపించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం రాజధానికి భౌగోళిక గుర్తింపు జరగలేదని అందుకే మ్యాప్‌లో చూపించడం కుదరలేదని అంటున్నారని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English