వంశీ అవాక్క‌య్యే నిర్ణ‌యం తీసుకున్న బాబు

వంశీ అవాక్క‌య్యే నిర్ణ‌యం తీసుకున్న బాబు

రాజ‌కీయంగా ఎలాంటి అడుగు వేస్తారో అనే అస్ప‌ష్ట‌త‌...వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో...అస‌లు తాను రాజ‌కీయాల నుంచే వైదొలుగుతున్నాన‌ని ఊహించ‌ని ట్విస్ట్ ఇస్తూ...తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ప‌ద‌వుల‌కు, పార్టీకీ రాజీనామా చేసేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీ వీడుతూ...తన రాజీనామాకు దారితీసిన అంశాలను ప్రస్తావిస్తూ వంశీ ఆదివారం మొదటి లేఖ రాశారు. వెంటనే దానిపై స్పందించిన చంద్రబాబు.. పార్టీలో వంశీ సేవలను కొనియాడారు.. ఆవేదనను అర్థం చేసుకున్నానని.. అండగా ఉంటానని స్పష్టం చేశారు. మ‌రో లేఖ‌లో కూడా ఇదే భ‌రోసా ఇచ్చారు. అయితే, అదే స‌మ‌యంలో..వంశీ త‌దుపరి అడుగుకు కూడా చంద్ర‌బాబు కౌంట‌ర్ రెడీ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామా లేఖ‌కు స్పంద‌న‌...మొద‌టి లేఖ‌కు ఆయ‌న ఇచ్చిన రిప్లైకి మ‌రో లేఖ‌...ఇలా టీడీపీ అధినేత చంద్రబాబు-వంశీ మధ్య ఇప్పుడు మొత్తం లేఖల ద్వారానే మాటలు కొనసాగుతున్నాయి. వంశీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న త‌రుణంలో...బాబు సైతం అదే రీతిలో ముందుకు సాగుతున్నారు. వల్లభనేని వంశీకి టీడీపీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని.. వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా వంశీ చేసే ప్రతీ పోరాటానికి తన మద్దతు ఉంటుందని రెండో లేఖ‌లో పేర్కొన్నారు. త‌ద్వారా వంశీ వైసీపీలో చేరినా...ఒకింత డిఫెన్స్‌లో ప‌డే రీతిలో బాబు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో పార్టీ ప‌రంగా త‌మ నిర్ణ‌యాలు సైతం ఆయ‌న తీసుకుంటున్నారు. వంశీ హ‌ఠాత్తుగా పార్టీని వీడిన‌ట్లే..త‌దుప‌రి ద‌శ‌లో ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌ళ్లీ వైసీపీ నుంచి బ‌రిలో దిగితే...త‌మ వైపు నుంచి సైతం నాయ‌కులు సిద్ధంగా ఉండేలా చంద్ర‌బాబు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఉప ఎన్నిక‌లు వ‌స్తే...మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, యువ‌నేత దేవినేని అవినాష్, జిల్లా పరిషత్ చైర్‌ప‌ర్సన్ గద్దె అనురాధ పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇందులో మ‌హిళా నాయ‌కురాలు, క్లీన్ ఇమేజ్ ఉన్న నేత‌గా పేరొందిన గ‌ద్దె అనురాధ‌కు అవ‌కాశం ఎక్కువ ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. గ‌ద్దె దంపతులకు గన్నవరం సొంత నియోజకవర్గం. వారికి వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంది. గద్దె రామ్మోహన్‌కు 1994లో టికెట్‌ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించడం ఆయ‌న స‌త్తాకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో...ఆమెను బ‌రిలోకి దింపేందుకు టీడీపీ అధినేత మొగ్గు చూప‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో ఈ మేర‌కు స్ప‌ష్ట‌త రావ‌చ్చ‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English