రాజయ్య ఎందుకు కారెక్కలేదు..

రాజయ్య ఎందుకు కారెక్కలేదు..

అధికార హస్తాన్ని విడిచి పెట్టి.. కారెక్కుతాడనుకున్న వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హటాత్తుగా కనిపించటం మానేశారు. మూడు రంగుల కండువా వేసుకొని తిరిగి.. తిరిగి అలసిపోయిన ఆయన ఎంచెక్కా గులాబీ కండువ వేసుకొని కలర్ ఫుల్ గా కనిపించాలనుకున్నారు. ఇదంతా అందం కోసం కాదు సుమీ. గుండెల్లో ఉన్న తెలంగాణ వాదం కోసం విలువైన పదవిని పణం పెట్టి మరీ గులాబీ దళంలోకి చేరిపోవాలని అనుకున్నారు. 

మాజీ పీసీసీ చీఫ్  కె. కేశవరావు నేతృత్వంలో మందా జగన్నాథం, జి. వివేక్ (కాంగ్రెస్ సీనియర్ నేత కాక ఉరఫ్ జి.వెంకటస్వామి పుత్రరత్నం)లతో పాటు రాజయ్య కూడా తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న వివక్షపై పోరాటం చేసేందుకు.. తెలంగాణపై ఉద్యమించేందుకు కాంగ్రెస్ ను వీడాలనుకున్నారు. అందుకు తగ్గట్లే పక్కా ప్లాన్ రూపొందించారు. రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వానికి డెడ్ లైన్ విధించారు. కానీ వారెంత మాత్రం పట్టించుకోలేదు. అంతే.. అన్న మాట నిలబెట్టుకోవటం కోసం వివేక్, మందాలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. వారి చేరికను ఘనమైన వేడుకలా చేసేందుకు జూన్ రెండున ఒక భారీ సభను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపోస్తున్నారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఒక పక్క ఇంత హడావుడిగా పనులు జరుగుతున్నా వరంగల్ ఎంపీ రాజయ్య పత్తా లేకుండా పోయారు.

అదేంటి.. మీతో ఎంపీ రాజయ్య ఎందుకు కలిసిరావటం లేదని మిగిలిన కాంగ్రెస్ నేతల్ని అడిగితే.. కలిసి వస్తాడని తాము ఆశిస్తున్నట్లు టూకీగా తేల్చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. టీఆర్ఎస్ లో చేరిన పక్షంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ ఎంపీ సీటును కేటాయించాలని కేసీఆర్ ను కోరారు. అయితే.. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే చేరిన కడియం శ్రీహరి రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ ఎంపీ టిక్కెట్టును తనకు ఇచ్చేందుకు వీలుగా ముందుగానే గులాబి అధినేత దగ్గర మాట తీసేసుకున్నారు. ఇప్పుడు రాజయ్య కనుక పార్టీలోకి వస్తే ఆయనకు ఎంపీ సీటు ఇవ్వటం కష్టమవుతుంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కకపోతే కుదరదు కాబట్టి... పార్టీ వీడాలన్న ఆలోచనను రాజయ్య తాత్కలికంగా వాయిదా వేసుకున్నారు.

అయితే.. టీఆర్ఎస్ నేతలు మరో ఆఫర్ ఆయన ముందు పెట్టారు.. మానకొండు నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలిసింది. అయితే.. ఎంపీగా ఉన్న తను ఎమ్మెల్యేకు పోటీ చేయటంపై రాజయ్యకు పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో ఆయన తాను మరోమారు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటానని చెప్పటంతో గులాబీ దళం రాజయ్యను తమ జాబితా నుంచి తాత్కలికంగా తీసేసినట్లు బోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు