భారత క్రికెట్ పాలన.. ఇప్పటిదాకా ఒక లెక్క

భారత క్రికెట్ పాలన.. ఇప్పటిదాకా ఒక లెక్క

భారత క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. లాంఛనం ముగిసింది. ప్రపంచంలో అత్యంత శక్తిమమంతమైన క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ అధ్యక్షుడిగా కోల్‌కతా రాకుమారుడు సౌరభ్ గంగూలీ పగ్గాలందుకున్నాడు. బుధవారం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో గంగూలీ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో.. అతను అధ్యక్షుడు కావడం లాంఛనమే అని ముందే తేలిపోయిన సంగతి తెలిసిందే. రెండు వారాల ముందు వరకు గంగూలీ అసలు అధ్యక్ష పదవి రేసులోనే లేడు. కానీ అనూహ్య పరిణామాల మధ్య గంగూలీకి దేశవ్యాప్తంగా క్రికెట్ సంఘాల మద్దతు లభించడం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అతడి వెనుక నిలవడంతో నాటకీయ రీతిలో అధ్యక్ష పదవి దాదాను వరించింది.

విజయనగరం మహరాజా (విజ్జీ) 1954లో బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాక.. పూర్తి స్థాయిలో ఈ పదవిని స్వీకరించిన క్రికెటర్ గంగూలీనే కావడం విశేషం. చెప్పాలంటే విజ్జీ కూడా పూర్తి స్థాయి క్రికెటర్ కాదు. ఎప్పుడూ రాజకీయ నాయకులు, క్రికెట్ లాబీయిస్టులే ఈ పదవిని అధిష్టిస్తుంటారు. గంగూలీ లాంటి మేటి క్రికెటర్ ఈ పదవిలోకి రావడంతో క్రికెట్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

2013 స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత సుప్రీం కోర్టు జోక్యంతో బోర్డు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. మూడేళ్లుగా సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీనే బీసీసీఐని నడిపిస్తోంది. దీంతో ఐసీసీకి కొమ్ములొచ్చాయి. బీసీసీఐ అంటే ఒకప్పుడు భయపడిన ఐసీసీ.. సరైన పాలకులు లేకపోవడంతో మన బోర్డును లెక్క చేయడం మానేసింది. బోర్డు ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు బోర్డు నుంచి అడిగేవాళ్లు లేకపోవడంతో క్రికెటర్లు, కోచ్‌ల్లో కూడా జవాబుదారీతనం తగ్గిందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీ లాంటి టఫ్ లీడర్ రాకతో బీసీసీఐలో కచ్చితంగా మార్పు ఉంటుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English