అంతా చేజేతులా పోగొట్టుకున్నారు..

అంతా చేజేతులా పోగొట్టుకున్నారు..

శ‌త్రువు బ‌లం కంటే.. మ‌నం చేసే వ్యూహాత్మ‌క త‌ప్పిదాలు, పొర‌పాట్లే మ‌న‌ల్ని ఓడిస్తాయి. చేజేతులా మ‌న‌కు విజ‌యాన్ని దూరం చేస్తాయి. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంద‌ని చెప్పాలి. పార్టీని ముందుండి న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డంతో ప్ర‌చారంలో, బీజేపీపై వ్యూహాత్మ‌క దాడి చేయ‌డంలో ఘోరంగా విఫ‌లం చెందారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి మ‌రింద ద‌య‌నీయంగా మారింది. ఏకంగా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి రాహుల్‌గాంధీ త‌ప్పుకోవ‌డంతో.. నేత‌ల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీకి దిశానిర్దేశం చేసేవారే క‌రువ‌య్యారు.

ఆ త‌ర్వాత తాత్కాలిక అధ్య‌క్ష బాధ్య‌త‌లను సోనియాగాంధీ తీసుకున్నా.. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల చురుగ్గా పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వహించ‌లేక‌పోతున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోతోంది. ఆ ప్ర‌భావం మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చాలా స్ప‌ష్టంగా క‌నిపించ‌ద‌ని చెప్పొచ్చు. ఇక్క‌డ మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. అయితే.. ప్ర‌చారంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా దూసుకుపోతే.. కాంగ్రెస్ కూట‌మి నుంచి బ‌ల‌మైన వాద‌న వినిపించేవారే క‌రువ‌య్యారు.

ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్‌గాంధీ ప్ర‌చారం చేసినా.. పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. ఇక శ‌ర‌ద్‌ప‌వార్ కూడా వృద్ధాప్యం కార‌ణంగా చురుగ్గా తిర‌గ‌లేక‌పోయారు. అయినా ఉన్నంత‌లో ఆయ‌న బెట‌ర్ అనిపించారు. బీజేపీ - శివ‌సేన కూట‌మికి పోటీ ఇచ్చే వాళ్లే లేర‌న్న‌ట్టుగా వాళ్లు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డంతో స‌హ‌జంగానే.. బీజేపీవైపు ప్ర‌జ‌లు మ‌ళ్లార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అందుకే మరాఠాలు కూడా కాంగ్రెస్‌, ఎన్సీపీల‌కు దూర‌మ‌య్యార‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మొత్తంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయ‌క‌త్వం లోపం మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం చూపింద‌ని చెబుతున్నారు.

నిజానికి.. ఒకప్పుడు మ‌హారాష్ట్రంలో కాంగ్రెస్‌, ఎన్సీపీలు చాలా బ‌లంగా ఉండేవి. అందులో శరద్ పవార్ పార్టీది ప్ర‌త్యేక‌మైన బ‌లం. మరాఠా ప్రాంతాల్లో పవార్ ప్ర‌భావం చూపేవారు. ఈ ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీ 125 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 125 స్థానాల్లోనూ పోటీ చేసింది. మిగిలిన 38 స్థానాలను మిగ‌తా మిత్రపక్షాలకు ఇచ్చారు. అయితే.. కాంగ్రెస్‌లో నాయ‌క‌త్వ లోపం.. వృద్ధాప్యంలో శరద్ పవార్ ఉండ‌డం.. ఇలా.. అనేక ప్ర‌తికూల అంశాలు ఉన్నాయ‌ని, అందుకే ఓట‌ర్ల‌పై ప్ర‌భావం చూప‌లేక‌పోయార‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు.

చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు ఈ రెండు పార్టీల‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు సైతం బీజేపీ, శివ‌సేన‌లోకి వెల్లిపోయారు. ఆఖ‌రికి సొంత పార్టీ శ్రేణులు కూడా న‌మ్మ‌కం కోల్పోతున్నారంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే.. ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే ప్ర‌క‌టించిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ కూట‌మికే అనుకూలంగా ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English