బైరెడ్డి మళ్లీ జంప్

బైరెడ్డి మళ్లీ జంప్

ప్రస్తుతం ప్రాధాన్యం కోల్పోయినా ఒకప్పుడు రాయలసీమలో కీలక నేతల్లో ఒకరిగా ఉన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి మళ్లీ పార్టీ మారుతున్నారు. కొన్నేళ్లుగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారుతూ ఎక్కడా గుర్తింపులేకుండా తిరుగుతున్న మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి చూపు ఇప్పుడు దేశాన్నేలుతున్న బీజేపీపై పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బలమైన అనుచర వర్గం ఉన్న ఆయన బీజేపీలో చేరాలా వద్దా అనే విషయంలో అనుచరుల అభిప్రాయం తెలుసుకునేందుకు వారితో భేటీ ఏర్పాటుచేస్తున్నారు. విషయం అనుచరుల భేటీ వరకు వచ్చిందంటే ఆయన చేరిక ఖాయమనే తెలుస్తోంది.

కొద్దికాలంగా టీడీపీ వైపు ఉంటున్న బైరెడ్డి ఇప్పుడు బీజేపీలో  చేరే అంశంపై అనుచరులతో చర్చించేందుకు ఈనెల 24న బైరెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్దే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇక టీడీపీ కోలుకోవడం అయ్యేపని కాదని ఆయన అర్థం చేసుకుని బీజేపీలోకి జంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో బైరెడ్డి కుటుంబం కాంగ్రెస్‌లో ఉండేది. టీడీపీ వచ్చాక ఆ పార్టీలో చేరింది. రెండు సార్లు బైరెడ్డి నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ పనిచేశారు. రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటుచేశారు. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు కోసమూ ఉద్యమించారు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో దాన్ని మూసేశారు. కాంగ్రెస్‌లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికారు. కానీ స్థానికంగా బైరెడ్డి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు.

రాయలసీమ సమస్యలపై అవగాహన, పట్టు, అక్కడి అభివృద్ధిపై విజన్ ఉన్న నాయకుడిగా బైరెడ్డికి గుర్తింపు ఉంది. అయితే, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా మొండిపట్టుదలతో ఉండే నేతయిన ఆయన ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ఆ కారణంగా ఎన్ని పార్టీలు మారినా ఆయనకు ప్రాధాన్యం దొరకడం లేదు. బీజేపీ అయినా ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే పార్టీకి, రాయలసీమకు కూడా ప్రయోజనం కలిగే వీలుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English