ఒంట‌రవుతున్న గులాబీ ద‌ళ‌ప‌తి..

ఒంట‌రవుతున్న గులాబీ ద‌ళ‌ప‌తి..

కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మ ర‌థ సార‌థి. స‌క‌ల జ‌నులూ ఆయ‌న వెంట నిలిచారు. ఆయ‌న మాట‌ను తీసేయ‌లేదు. స్వ‌రాష్ట్రం సిద్ధించిన త‌ర్వాత అధికారం కూడా ఆయ‌న‌కే క‌ట్ట‌బెట్టారు. రెండోసారి కూడా ఆయ‌న‌కే పాల‌నాప‌గ్గాలు అప్ప‌గించారు. కానీ.. ఈ ఆరేళ్ల‌లోనే అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.

కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెరిగింది. తెలంగాణ ప్ర‌జ‌లు తిండికి లేకున్నా క‌డుపుమాడ్చుకోనైనా ఉంటారుగానీ.. దొర‌త‌నాన్ని, నియంతృత్వాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒప్పుకోరని, ఇప్పుడు కేసీఆర్ కూడా నియంతృత్వ ధోర‌ణితో వ‌స్తున్నార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది.

నిజానికి.. చాలాకాలంగా ప్ర‌తిప‌క్షాలు ఇదే ఆరోప‌ణ చేస్తున్నాయి. కేసీఆర్ నియంత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నాయి. తాజాగా.. జ‌రుగుతున్న ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో ఇదే విష‌యం రుజువు అయింద‌ని చెబుతున్నాయి. నిజానికి.. టీఆర్ఎస్‌ పార్టీలో, ప్ర‌భుత్వంలో కేసీఆర్ చెప్పిందే వేదం.. పేరుకే మంత్రులు.. వారికి సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉండ‌దు. క‌నీసం అభిప్రాయం చెప్పే అవ‌కాశం కూడా ఉండ‌ద‌ని ప‌లువురు మంత్రులు త‌మ స‌న్నిహితుల వ‌ద్ద బాధ వెలిబుచ్చుకుంటార‌ట‌. దీంతో సొంత పార్టీలోనూ చాలామంది నేత‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.

ఇక 35 రోజుల ముందే స‌మ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చ‌లు జ‌రుప‌కుండా.. మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌పై ఇటు సొంత‌ పార్టీతో పాటు.. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర అసంతృప్తి ర‌గులుకుంటోంది. అంతేగాకుండా.. సుమారు 50 వేల మంది కార్మికుల‌ను సెల్ఫ్ డిస్మిస్ చేయ‌డంపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకోవ‌డానికేనా.. స్వ‌రాష్ట్రం సాధించుకున్న‌ది..? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డితే త‌ట్టుకోలేరు అంటూ హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ మొత్తం కేసీఆర్ న‌డించింది. స‌క‌ల జ‌నులూ జేజేలు ప‌లికారు.

ఇప్పుడు అదే తెలంగాణ స‌మాజం మొత్తం కేసీఆర్‌కు వ్య‌తిరేక‌మ‌వుతోంది. స‌క‌ల జ‌నులు శాప‌నార్థాలు పెడుతున్నారు. ఆయ‌న ఫ్లెక్సీలు ద‌హ‌నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల త‌ల‌పెట్టిన తెలంగాణ బంద్ విద్యార్థులు, ఉద్యోగులు, విప‌క్షాలు.. విద్యావంతులు, న్యాయ‌వాదులు.. ఇలా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు మద్ద‌తు ఇస్తున్నారు. ఇంత‌లోనే ఎంత తేడా.. ఇప్పుడు కేసీఆర్ ఒంట‌రి అవుతున్నారు. ఆయ‌న వెంట న‌డిచే వారు క‌రువ‌య్యార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇక సోష‌ల్ మీడియా వేదిక‌గా కేసీఆర్‌పై యుద్ధ‌మే చేస్తున్నారు. దీంతో మొట్ట‌మొద‌టి సారి కేసీఆర్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయార‌ని, ఇక ఆయ‌న రాజ‌కీయ జీవితం చివ‌రి ద‌శ‌లో డౌన్‌ఫాల్స్ ప్రారంభ‌మైంద‌నే టాక్ తెలంగాణ‌లో బ‌లంగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English