అయిదేళ్ల అయోమయానికి చెక్ చెప్పనున్న జగన్

అయిదేళ్ల అయోమయానికి చెక్ చెప్పనున్న జగన్

రాష్ట్ర విభజన జరిగి అయిదేళ్లు దాటింది. విభజన తరువాత రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకోవడాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. విభజనకు ముందు ఏటా నవంబరు 1ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించేవారు.

కానీ, 2014 జూన్ 2న ఏపీ నుంచి తెలంగాణ విడిపోవడంతో మిగిలిపోయిని ఆంధ్రప్రదేశ్‌ను నవంబరు 1న ఏర్పడిన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఇది కాబట్టి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ అవతరణ జరుపుకోలేమని.. ఇక జూన్ 2న జరిగిన తెలంగాణ ఏర్పాటును ఏపీ ప్రజలు ఇష్టపడలేదు కాబట్టి ఆ తేదీన మిగిలిపోయిన అవశేష ఆంధ్రప్రదేశ్ అవతరణను జరుపుకోవడం సమంజసం కాదంటూ చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపడమే మానేసింది.

అయితే, కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఈ అనిశ్చితి తెరదించింది. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న కాకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1నే అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ నెల 21న పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పటికీ ఏపీ కొత్త రాష్ట్రం కాదు కాబట్టి సమైక్యాంధ్ర ఏర్పడిన రోజునే ఇప్పటి ఏపీ అవతరణగా జరుపుకోవాలని అధికారులు సూచించడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో నవంబరు 1న ఎప్పటిలా రాష్ట్ర అవతరణను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారి అమరావతిలో రాష్ట్రావతరణ వేడుకలు జరగబోతున్నాయి. కాగా గత చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో గందరగోళ పడి ఏకంగా అవతరణ దినోత్సవమే నిర్వహించేది కాదు. అందుకు బదులుగా జూన్ 2 నుంచి ప్రభుత్వం ఏర్పడిన 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్షల పేరుతో కార్యక్రమాలు నిర్వహించేది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English