గులాబీని వ‌ణికిస్తోన్న గుర్తులు

గులాబీని వ‌ణికిస్తోన్న గుర్తులు

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది. ప్ర‌ధానంగా అధికార టీఆర్ఎస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ఉప ఎన్నిక‌ను తీసుకుంటోంది. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో ఎలాగైనా గెలిచి, ప్ర‌జా మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌న్న సంకేతాల‌ను బ‌లంగా పంపాల‌ని చూస్తోంది.

కానీ.. ఇదే స‌మ‌యంలో గులాబీ పార్టీని ఓ అంశం వ‌ణికిస్తోంది. గుండెళ్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తోంది. అదేమిటంటే.. గుర్తులు. టీఆఎస్‌కు చెందిన కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించడం, పైగా జాబితాలో అవి కారు గుర్తు త‌ర్వాతి స్థానాల్లో ఉండడం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ అభ్య‌ర్థి సైదిరెడ్డికి గుర్తు గుబులు ప‌ట్టుకుంద‌ని గులాబీ శ్రేణులు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. నిజానికి.. 2018లో జ‌రిగిన‌ అసెంబ్లీ, ఆ త‌ర్వాత జ‌రిగిన‌ పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో ట్ర‌క్కు గుర్తుతో టీఆర్ఎస్‌కు భారీ షాకులు త‌గిలాయి.  

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ట్రక్కు గుర్తును కేటాయించడం, అది కారు గుర్తు ను పోలి ఉండటంతో.. ఓటర్లు అయోమయానికి గురయ్యారని, తమకు ఓటు వేయబోయి.. ట్రక్కు గుర్తుకు వేశారని టీఆర్ఎస్‌ నేతలు గతంలో ప‌దేప‌దే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో గెల‌వాల్సిన చోట్ల ఓడిపోయామ‌ని అన్నారు.

ఇక ప్రస్తుతం హుజూర్‌నగర్ ఉప ఎన్నిక‌లోనూ అటువంటి ఆందోళననే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు ఉండగా.. టీఆర్ఎస్‌ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డికి సీరియల్‌లో నాలుగో నంబర్‌ కేటాయించారు. ఆయన తరువాత ఐదో నంబర్‌లో రైతుబిడ్డ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అజ్మీర మహేశ్‌ అనే స్వతంత్ర అభ్యర్థికి ‘ట్రాక్టర్‌ నడిపే రైతు’ గుర్తును, ఆరో నంబరులో రిపబ్లిక్‌ సేన తరఫున బరిలో నిలిచిన వంగపల్లి కిరణ్‌కు రోడ్డు రోలర్‌ గుర్తులు వ‌చ్చాయి. అయితే.. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో నెలకొంది.

ఇప్ప‌టికే తాజాగా జ‌రుగుతున్న ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌న్నీ ప్ర‌తికూలంగా మారుతున్నాయని ఆందోళ‌న చెందుతున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేస్తోంది. అదే విధంగా.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన పాజిటివ్ వేవ్‌ను కొన‌సాగించాల‌ని, గెల‌వ‌లేకపోయినా.. భారీ ఓట్లు సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ  ఉంది.

ఈ నేప‌థ్యంలో హుజూర్‌నగర్‌లో పరిస్థితి హోరాహోరీగా మారుతోంది. నేత‌లంద‌రూ ఇక్క‌డే తిష్ట‌వేశారు. ఎక్క‌డ కూడా చిన్న‌పాటి లోపం త‌లెత్త‌కుండా నేత‌లు ప‌క‌డ్బందీ వ్యూహాల‌తో జ‌నంలోకి వెళ్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English