సీఎంకు షాకులిస్తూ గవర్నర్ ఫుల్ యాక్టివ్

సీఎంకు షాకులిస్తూ గవర్నర్ ఫుల్ యాక్టివ్

మన దేశంలోని సిస్టంను చూస్తే భలేగా అనిపించక మానదు. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్న రీతిలో మన చట్టం ఉంటుంది. చేతిలో పవర్ ఉన్నోళ్లు ఏమైనా చేసే వీలు ఉంటుంది. అలా అని వారికి చెక్ పాయింట్లు ఉండవని కావు. కాకుంటే.. చెక్ పాయింట్లు చూసి చూడనట్లుగా వదిలేస్తే ఓకే. కానీ.. ఆ చెక్ పాయింట్లే చర్యలు తీసుకునే దిశగా పని చేయటం మొదలెడితే అధికార పక్షానికి కలిగే ఇబ్బంది అలా ఇలా ఉండదు.

ఇప్పుడు అలాంటి ఇబ్బందినే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొనున్నారు. ఆర్టీసీ సమ్మె పదమూడు రోజులు పూర్తి అయినా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై రంగంలోకి దిగారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసి.. హైదరాబాద్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన యోగా తరగతులు.. బతుకమ్మ వేడుకలకు సంబంధించిన వివరాల్ని చెప్పినట్లుగా ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ప్రధాని మోడీతో భేటీ తర్వాత నుంచి గవర్నర్ తమిళ సై చేతల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందంటున్నారు. మొన్నటి వరకూ ఆర్టీసీ సమ్మె విషయంలో చూసిచూడనట్లుగా ఉంటూ.. సమాచారం మొత్తాన్ని సేకరించిన ఆమె.. ఇప్పుడు అందుకు భిన్నంగా యాక్షన్ లోకి వచ్చేసినట్లుగా చెబుతున్నారు.పదమూడు రోజులుగా సమ్మె జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన చర్యల మాటేమిటి? అన్న క్వశ్చన్లను ఆమె సంధిస్తున్నారు.

సమ్మె చేస్తున్న 48,500 మంది కార్మికుల ఉద్యోగాలు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పనిగా ప్రస్తావించటాన్ని తమిళ సై  ప్రశ్నించేలా ఆమె తీరు మారిందంటున్నారు. తాజాగా రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేసిన గవర్నర్.. సమ్మె తీవ్రత గురించి తెలుసుకోవటమేకాదు.. సెల్ఫ్ డిస్మిస్ పేరుతో కార్మికుల తొలగింపు సంగతి ఏమిటన్న విషయాన్ని ఆరా తీసినట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. చట్టంలో సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఉందా? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ పదం లేకుండా  48వేల మంది ఉద్యోగుల ఉద్యోగాలు పోయినట్లు ఎలా చెబుతారని నిలదీసినట్లుగా తెలిసింది. ఈ పరిణామానికి మంత్రి పువ్వాడ ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. కార్మికులతో చర్చలుజరపటానికి.. ప్రజారవాణా వ్యవస్థను సాధారణ స్థితిలోకి తెచ్చేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తనకు తెలపాలని మంత్రిని కోరినట్లు తెలుస్తోంది.ఇక.. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మను పలు ప్రశ్నలు వేయగా.. రాజ్ భవన్ కు వచ్చి తాను అన్ని విషయాలు వివరిస్తానని చెప్పటం గమనార్హం. చూస్తుంటే.. గవర్నర్ ఫుల్ యాక్టివ్ కావటం.. తానే సీన్లోకి నేరుగా వచ్చేయటం సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English