ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రెండుగా చీలిన టీఆర్ఎస్.. నిజమెంత?

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రెండుగా చీలిన టీఆర్ఎస్.. నిజమెంత?

కాలం కలిసి రాకపోయినా.. అధికారం తలకు బాగా పట్టేస్తే వచ్చే తిప్పల్నే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొంటున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఎప్పుడు తగ్గాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదన్న మాట గతంలో వినిపించేది. ఆ గుణం ఆయనకు ఉన్నంత కాలం ఎదురులేని రీతిలో ఆయన సాగేవారు. ఎప్పుడైతే.. ఆ గుణాన్ని ఆయన విడిచి పెట్టారో అప్పటినుంచో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె దీనికో నిదర్శనంగా చెప్పాలి. పద్నాలుగు రోజులుగా సాగుతున్న సమ్మెపై తొలుత తెలంగాణ సమాజంలో కాస్త వ్యతిరేకత ఉందన్నది నిజం. అయితే.. ఎప్పుడైతే తమ వాదనను ఆర్టీసీ ఉద్యోగుల సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారో అప్పటి నుంచి సమ్మెకు కారణం సీఎం కేసీఆర్ ఆయన మైండ్ సెట్ అన్న భావన తెలంగాణ సమాజంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఇదే ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీని రెండు ముక్కలు అయ్యేలా చేసిందంటున్నారు. కంటికి కనిపించని ఈ చీలిక.. టీఆర్ఎస్ నేతల్లో ఒకరికొకరికి అర్థమయ్యేలా చేస్తుంది. యూటీ (ఉద్యమ బ్యాచ్).. బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచులుగా టీఆర్ఎస్ పార్టీలో చీలక వచ్చినట్లుగా చెబుతున్నారు. ఉద్యమం నాటి నుంచి పార్టీలో ఉన్న వారంతా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో సారు తప్పు చేస్తున్నారన్న భావనతో ఉంటే.. టీఆర్ఎస్ పవర్లోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ నేతలు మాత్రం సీఎం చేస్తున్నది సరైనదేనని.. ఆర్టీసీ కార్మికుల బ్లాక్ మొయిల్ కు లొంగాలా? అని ప్రశ్నించటం కనిపిస్తుంది.

దీంతో.. తమ తోటి నేతల పైనే టీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారు. దీనికి తగ్గట్లే టీఆర్ఎస్ నేత ముత్తురెడ్డి సైతం ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక తమ పార్టీ నేతలే ఉన్నారన్న మాటను ఆ మధ్యన ప్రకటించిన సంచలనంగా మారారు. ఆర్టీసీ సమ్మె పార్టీలో కంటికి కనిపించని విభజనను తీసుకొచ్చిందని.. పార్టీ నేతలంతా తామంతా ఒక్కటన్న భావనలో లేరని.. యూటీ.. బీటీ అంటూ డివిజన్ వచ్చేసిందన్న మాట వినిపించింది. మరి.. ఇలాంటి వాటికి సరైన సమయంలో మందు వేయకపోతే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English