మ‌హిళ..మ‌ద్యం..తెలంగాణ‌లో ఓ రికార్డు

మ‌హిళ..మ‌ద్యం..తెలంగాణ‌లో ఓ రికార్డు

వచ్చే నవంబర్ 1వ తేదీ తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. నూత‌న విధానంలో భాగంగా, బుధవారం సాయంత్రం 4గంటలకు వైన్స్ షాపుల కోసం దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే, ఆదిలో మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు చివరి తేదీ కావడంతో భారీ సంఖ్య‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ దర‌ఖాస్తుల్లో అధికం మ‌హిళ‌ల‌వే కావ‌డం విశేషం. ప్ర‌ధానంగా హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలో మ‌హిళ‌ల ద‌ర‌ఖాస్తులు పోటెత్తాయి.

హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలోని 595 షాపులకు 8692 మంది టెండర్లు వేస్తే… వీటిలో 3000 వరకు మహిళలే టెండర్లు వేసినట్లు అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. మద్యం వ్యాపారుల తల్లులు, భార్యలు, కూతళ్లు, కోడళ్ల పేర్లపై టెండర్లు వేసినట్లు సమాచారం. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 595 షాపులున్నాయి. వీటికి 8,692 మంది టెండర్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌‌ జిల్లా 173 షాపులకు 1238, రంగారెడ్డి జిల్లాలో 422 షాపులకు 7454 మంది  టెండర్లు వేశారు. మంగళవారం నాటికి హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలోని 595 షాపులకు 3628 టెండర్లు మాత్రమే వచ్చాయి. కానీ బుధవారం ఒక్క రోజే 5064 మంది టెండర్లు వేయడం విశేషం.

మ‌రోవైపు, మద్యం టెండర్ల ద్వారా హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలోని షాపులకు కలిపి వేసిన దరఖాస్తులతో ఎక్సైజ్‌‌ శాఖకు రూ.173.84 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌‌లోని 173 షాపుల ద్వారా రూ.24.76 కోట్లు, రంగారెడ్డి జిల్లాలోని 422 షాపులకు రూ.149.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే సుమారుగా రూ.111 కోట్లు హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలోని షాపుల ద్వారా ఎక్సైజ్‌‌కు ఆదాయం సమకూరింది. ఇలా మ‌ద్యం అమ్మ‌కాల ద‌ర‌ఖాస్తులో రికార్డు సృష్టించ‌డ‌మే కాకుండా...మ‌హిళ‌ల ద‌ర‌ఖాస్తులో కూడా హైద‌రాబాద్ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

ఇదిలాఉండ‌గా, ఎంఆర్‌పీ రేట్ల కంటే ఎక్కువ ధరకు లిక్కర్ అమ్మొద్దంటూ ఎక్సైజ్‌శాఖ సర్క్యులర్ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చట్టప్రకారం 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. ఎక్సైజ్‌శాఖ తరఫున మరో రూ.2 నుంచి 3లక్షల అపరాధ రుసుము కట్టేలా నిబంధనలు రూపొందించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English